* ఆరోగ్యం అందరిచెంతకు *
మనిషి మానసిక వికాసానికి కావలసిన ప్రాధమిక వనరు విద్య. మెరుగైన ఆరోగ్యానికి వైద్యం అత్యవసరం. పౌర సమాజాన్ని వ్యాధులబారి నుండి రక్షిస్తూ , ఆయు:ప్రమాణాల్ని పెంచడంలో కీలకమైనది వైద్యం. నేడు కరోనా వంటి వ్యాధులతో పోరాడుతున్న సామాన్యులకు ' లక్షలు లేకపోయినా ఆరోగ్యం లక్షణంగా వుంటే చాలు. అదే పది వేలు ' అనుకునే రోజులొచ్చాయి. బతికుంటే బలుసాకైనా తినొచ్చు అనుకునే వారు దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఏ వ్యాధి సంభవించినా వైద్యపరంగా ప్రాథమిక చికిత్సతో పాటు ప్రజల్లో అవగాహన చర్యలు ముఖ్యం. ముందు జాగ్రత్తలు పాటించడం అవసరమే !
'అందరికీ ఆరోగ్యం అందుబాటులో వైద్యం ' అని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఆరోగ్య రంగంలో పలు సంస్కరణలు తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కార్ నియమించిన హైలెవెల్ కమిటీ 120 పేజీల నివేదికను ఆర్నెల్ల క్రితం ప్రభుత్వానికి సమర్పించింది . రాజ్యాంగం ప్రకారం ' ప్రజారోగ్య వ్యవస్థ ' అనేది ఇన్నాళ్లు రాష్ట్రాల జాబితాలో ఉంది. ఇకపై కేంద్ర , రాష్ట్రాల పరిధి నుండి ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చి పౌర సమాజానికి ఆరోగ్య ధీమా కల్పించే చర్యలు వేగవంతం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనాన్ని నివారించి కేంద్రమే అజమాయిషీ ప్రదర్శించే ఆలోచనకు పదును పెడుతోంది. ఈవిధంగా రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో మెడికల్ సీట్లను , ఆసుపత్రుల సంఖ్యను యుద్ధ ప్రాతిపదికన పెంచే యోచనతో కేంద్రం అడుగులేస్తోంది.
* నివేదిక సారాంశం*
15 వ ఆర్థిక సంఘం ఏర్పాటుచేసిన ఈ హైలెవల్ కమిటీ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్ వాటాకి జాతీయోత్పత్తి (జీడీపీ )లో 2.5 శాతానికి పెంచాలని సూచించింది. ఇంకా ఈ నివేదిక ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో ఆసుపత్రులను నెలకొల్పాలంటే అయా రాష్ట్రాల సానుకూల దృక్పధం అవసరం. తగిన భూములు కేటాయించాలి. విద్యుత్ , నీటి , భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ అనుమతులు వంటివి సకాలంలో మంజూరీ చేయబడాలి . ఉదాహహరణకు ఒక 200 పడకల ఆసుపత్రి నిర్మించబడాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది గనుక చాలినంత బడ్జెట్ లేని సంస్థల కోసం రైతులకు అత్యల్ప వడ్డీకే రుణాలిచ్చినట్లు వీటికి కూడా రుణసౌకర్యం కల్పించాలి. సామాన్య ఇంటి వాడుక రేట్లకే నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా క్లియరెన్స్ సాధించబడాలి. ఈ పనుల సానుకూలతలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయము తప్పనిసరి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రం ముఖ్య సలహాదారైన నీతిఆయోగ్ రూపొందించిన అడ్వైజరీ నోట్ ను కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సిఫారసు చేసింది.
*ఆరోగ్య భీమా - పేదలకు ధీమా *
దేశంలో ఆర్థిక వెసులుబాటులేని నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య ధీమా అందించడమే లక్ష్యంగా మోదీ ' ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజీఎవై ) పధకాన్ని 2018 , సెప్టెంబర్ 23 న రాంచీలో ప్రారంభించారు. 'ఆయస్మాన్' లో అంతర్భాగమైన ఈ పథకం ప్రకారం ఒక్కో కుటుంబానికీ ఏడాదికి ఐదు లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తారు. కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ వైద్యానికి అర్హత వున్న ఈ పథకానికి కేంద్రమే నిధులు సమకూరుస్తుంది. అమలు చేయడం మాత్రం రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ పౌరునికి ఉచిత విద్యతో పాటు వైద్యం పొందడమూ ప్రాథమిక హక్కు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో - ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కుగా ప్రసాదించాలని మోఢీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ లక్ష్యం సాధించడానికి దేశవ్యాప్తంగా మూడు వేల నుంచి ఐదు వేల వరకు 200 పడకల సామర్ధ్యం గల ప్రెవేట్ హాస్పిటళ్లను అదనంగా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. 2025 నాటికీ వైద్యుల , పారామెడికల్ సిబ్బంది కొరతను నివారించేందుకు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు చేసి సరిసమానమైన పీజీ మెడికల్ సీట్లను పెంచే ప్రయత్నాలు వేగిరం అవుతున్నాయి. ప్రైవేట్ సంస్థలు కొత్త దవాఖానాలు టయర్-2 , టయర్-3 పట్టణాల్లో మరియు వైద్యసేవలు మృగ్యమైన మారుమూల గ్రామాలలో , షెడ్యుల్డ్ ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటుకు కొన్ని రాష్ట్రాలు సానుకూల వైఖరి ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త " ఇండస్ట్రీ - ఫ్రెండ్లీ " సూత్రాన్ని ప్రతిపాదించింది. దీనికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయింపు చేయడమే తరువాయి. అబ్దుల్ కలాం చేప్పినట్లు సామాన్యుల దాకా వైద్యం చేరాలి. దేశాభివృద్ధికి పట్టుగొమ్మలైన పల్లెల్లోనూ దవాఖానాలు నిర్మిస్తే గ్రామీణ ఆరోగ్యం మెరుగవుతుంది. మండల కేంద్రాల్లోని పి.హెచ్. సి.లను 30 పడకల ధర్మాసుపత్రులుగా ఉన్నతీకరించాలి. ప్రభుత్వ ఆసుపత్రులపైనా, వైద్యుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా అన్నీ వైద్య సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి. అతిప్రాధాన్యతగా ప్రత్యేక పారితోషికంతో గ్రామీణ వైద్యులను ప్రోత్సహిస్తూ , వారి కొరతను నియామక ప్రక్రియ ద్వారా అధిగమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు స్థానికంగా క్వార్టర్లు నిర్మించాలి. నియోజక వర్గానికొక శిక్షణా వైద్యశాలను నెలకొల్పాలి. గామీణ ప్రాంతాలలోని బడుగు ప్రజలు , దళిత , గిరిజన ,మైనారిటీలకు 30 శాతం ప్రత్యేక మెడికల్ సీట్లు కెటాయించాలి. కరోనా వంటి వైద్యం పేదలకు చేరాలంటే ' ఆరోగ్య శ్రీ ' లో చేర్చాలి. ఇత్యాది సౌకర్యాలన్నీ సఫలీకృతంగా , సవ్యంగా సమకూరితే ప్రజల చెంతకీ ఉచిత వైద్యం చేరటం సులభతరమవుతుంది.
-గుమ్మడి లక్ష్మీ నారాయణ
9491318409
0 Comments