//తెల్లోళ్లకు తలొంచని.. రాణీమా//


స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ సైన్యంపై పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి రాణీ గైడిన్ల్యూ. గిరిజనుల జీవన విధానాన్ని కాపాడటానికి తెల్ల దొరల ఆయుధాలకు ఎదురు నిలిచిన ధీర వనిత. నాగా జాతిలోని రాంగ్ మోయీ తెగకు చెందిన రాణీమా దేశం గర్వించదగ్గ యోధురాలు. బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన పోరాట పటిమ, ధైర్య సాహసాలు, త్యాగం అసమానం. మణిపూర్ పశ్చిమ ప్రాంతంలోని చిన్న గ్రామంలో 1915 ,జనవరి 26న జన్మించారు. బాల్యం నుంచే స్వాతంత్య్ర భావాలను పుణికిపుచ్చుకున్నారు. తొలిసారిగా బ్రిటిష్ ఆర్మీకి అండగా మెసపటేమియా యుద్ధంలో పాల్గొన్నారు.
కానీ,ఇండియాపై తెల్లవాళ్ళ ఆగడాలను ప్రత్యక్షంగా చూసిన ఆమె ఆ సైన్యానికి వెంటనే రాజీనామా చేసి బయటికొచ్చారు. అప్పటికే మణిపూర్ ప్రాంతంలో ఆదివాసీల తరఫున పోరాడుతున్న జాధోనాంగ్ తో కలిసి హరాకా అనే ఉద్యమ సంస్థను ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్లను మన దేశం నుంచి తరిమికొట్టాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. మరో వైపు నాగా జాతి ప్రజల్లో అన్ని విధాలా చైతన్యాన్ని రగిలించడంలో అలుపెరగక కృషి చేశారు. ఈ ఉద్యమం మొదలైన కొద్ది రోజుల్లోనే బ్రిటిష్ పాలకులు అక్కసుతో జాధోనాంగ్ ని దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేసి విచారణ జరిపారు. తర్వాత మరణ శిక్ష విధించారు. దీంతో రాణీమా 17 ఏళ్ల వయసులోనే ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టారు.
అతిచిన్న వయసులోనే ఆమె సాయుధ బలగాలను సిద్ధం చేసుకొని పోరాట స్థావరాన్ని బరక్ నదీ సమీపానికి మార్చారు. ఉద్యమంలో పాల్గొన్న గిరిజన, గిరిజనేతర గ్రామాలపై తెల్లోళ్లు విరుచుకుపడ్డారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా, వాళ్లంతా ధైర్య సాహసాలతో రాణీమా నాయకత్వంలో బ్రిటిష్ వాళ్లను ఎదిరించి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు. హరాకా మూమెంట్ నాగా జాతిలోని ముఖ్య తెగలను ఏక తాటిపైకి తెచ్చింది. ఆదివాసీలపై విదేశీ సంస్కృతి ప్రభావం పడకుండా కాపాడింది. అందుకే మణిపూర్ ప్రజలు ఆమెను దేవతతో సమానంగా చూసేవారు. రాణీ'మా అని పిలుచుకునేవారు. ఆమె నేతృత్వంలో మణిపూర్ పశ్చిమ, నాగాలాండ్ దక్షిణ, అసోం ఉత్తర ప్రాంతాల్లో స్వాతంత్ర్యోద్యమ జ్వాలలు బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించాయి. ఇంత బలమైన ఉద్యమాన్ని నిర్మించినందుకు రాజీమాపై కక్ష కట్టిన సర్కారు ఆమెను బంధించేందుకు డిప్యూటీ కమిషనర్ జేపీ మీల్స్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపింది. రాణీమా ఆచూకీ చెప్పినవారికి నజరానాలను ప్రకటించింది. రాణీమా తమలో ఒకరిగా ఉంటూ తమతో అజ్ఞాతంలో తిరుగుతున్నప్పటికీ ఉత్తర కభార్ ప్రజలెవరూ ఆమె జాడ చెప్పలేదు. రాణీమా అంటే వారికెంత అభిమానమో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు.
నాగా స్వాతంత్ర్య దళం బ్రిటిష్ అస్సాం రైఫిల్స్ పై దాడి చేసింది. కానీ, నాగాల ఆయుధాలైన కత్తి, డాలు, బాణం ఆంగ్లేయుల ఆధునిక ఆయుధాల ముందు నిలవలేకపోయాయి. వేలమంది నాగాలు వీర మరణం పొందారు. తర్వాత రాణీమా ఉత్తర మణిపూర్, నాగాల కేంద్ర స్థానమైన కోహిమాల్లో పర్యటిస్తూ సాయుధ బలగాలను కూడగట్టుకున్నారు. అసోం రైఫిల్స్ 'హంగ్రమ్' అనే ప్రాంతంలో కట్టెలతో ఒక కోటను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాణీమా కూడా గట్టి నిర్ణయం తీసుకున్నారు. 'విజయమో వీర స్వర్గమో' తేల్చుకోవాలనే తెగింపుతో పాలోమీ గ్రామ సమీపంలో ఆమె కూడా ఒక కోటను నిర్మించుకున్నారు. ఆ స్థావరాన్ని కనిపెట్టిన అస్సాం రైఫిల్స్ అకస్మాత్తుగా దాడికి దిగారు. ఇంగ్లీష్ వాళ్ల ఆధునిక ఆయుధాల ధాటికి నాగాలకు ఓటమి తప్పలేదు. రాణీమాను అస్సాం రైఫిల్స్ అదుపులోకి తీసుకొని తొలుత కోహిమాకు ఆ తర్వాత ఇంఫాల్ జైలుకు తరలించారు.
జాధోనాంగ్ మాదిరిగానే రాణీమాకూ బ్రిటిష్ గవర్నమెంట్ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇలా 15 ఏళ్ల పాటు ఆమె జీవితం చెరసాలల్లోనే గడిచింది. అయినా హరాకా ఉద్యమం ఏం తగ్గలేదు. అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన తర్వాత గిరిజన తెగల సంక్షేమం కోసం ఛత్తీస్ ఘడ్ లో అఖిల భారతీయ వనవాసీ కళ్యాణాశ్రమానికి అనుబంధంగా పనిచేశారు.
#మెచ్చుకున్న నెహ్రూ#
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఓసారి అసోంకి వచ్చినప్పుడు రాణీమా దేశభక్తిని మెచ్చుకున్నారు. ఆమెను విడుదల చేయించటం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో మంతనాలు జరిపారు. ఉత్తరాలలో ఆమెను 'నాణేల రాణి' గా ప్రస్తావించేవారు. దేశానికి ఆమె చేసిన సేవలకు 'పద్మభూషణ్'తో సత్కరించారు. ఆమె శత జయంతి(1915-2015) సందర్బంగా భారత ప్రభుత్వం నాణెన్ని విడుదల చేసింది. పోరాటాన్నే జీవితంగా భావించి సాగించిన రాణీమా దేశవ్యాప్తంగా ఆదివాసీల, అణగారిన ప్రజల హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తి.
#లక్ష్మీ నారాయణ గుమ్మడి
9491318409