జనవరి 29 : కామ్రేడ్ గుంపస్వామి వర్దంతి సందర్బంగా ... 

//శ్రీకాకుళ గిరిజనోద్యమతార గుంపస్వామి//

చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటానికి ఊతమిచ్చినది శ్రీకాకుళ రైతాంగ గిరిజనోద్యమం (1967-70). ఇది చరిత్రలో చిరస్మరణీయమైన సాయుధ రైతాంగ పోరాటం. ఆ ఉద్యమ రధసారధులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం మాస్టార్లు. వారి సారధ్యానికి ముఖ్య అనుచరగణం ఆరిక గుంపస్వామి, ఆరిక సోములు, బిడ్డిక గున్నమ్మలు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరిగిన గిరిజన రైతంగ పోరాటం ఒక మహోద్యమాన్ని తలపించింది. పూర్వం కళింగ రాజ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అంతర్భాగంగా ఉన్నాయి. పార్వతీపురం , పాలకొండ, పాతపట్నం, గుమ్మలక్ష్మీ పురం వంటి ఏజెన్సీ గూడేల్లో ప్రధానంగా జాతాపు, సవరలు అనే గిరిజన ఆదివాసీలు నివసిస్తున్నారు. కళింగ రాజ్యంపై దండెత్తిన అశోక చక్రవర్తి కాలం నుంచి వారిది పోరాటమే జీవితంగా మారిన దుస్థితి. పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదు. షావుకారుల మోసాలు మితిమీరాయి. శ్రీకాకుళములోని షెద్యూల్ ఏజెన్సీ ప్రాంత గిరిజనుల భూసమస్యలు అపరిష్కృతమైనాయి. ఏజెన్సీ భూసమస్యలపై న్యాయ పోరాటానికి అధిభట్ల కైలాసం, సత్యం మాసార్లు మార్గదర్శకులు. వారికి ముఖ్య అనుయాయులుగా ఆరిక గుంపస్వామి సహకారం గిరిజనోద్యమానికి కీలకమైనది.
శ్రీకాకుళం జిల్లా కురుపాం మండలంలోని లంకాజోడు గ్రామంలో జాతాపు తెగలో ఆరిక గుంపస్వామి జన్మించాడు. సత్యం, కైలాసంలు 1961లో ప్రారంభించిన గిరిజన సంఘంలో చేరాడు. నిరుపేద గిరిజనుడైన స్వామి వ్యవసాయ కూలీగా, భూస్వాములు, వద్ద పాలేరుగా పని చేశాడు. బాల్యం నుంచి తోటి ఆదివాసీల దుర్బర జీవితానుభవాలను దృష్టిలో ఉంచుకొని గిరిజన సంక్షేమ సంఘాల నిర్మాణం చేపట్టి తుదకు శ్రీకాకుళోద్యమ సారధుల సరసన సహచర నాయకుడిగా నిలిచి పోయాడు. గిరిజన సంఘంలో చురుకైన, చైతన్య వంతమైన పాత్ర పోషిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ భూపోరాటంలో పాల్గొన్నాడు. ఆకాలంలో గిరిజన సంఘాలతో పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీలో గుంపస్వామికి సంబందాలేర్పడ్డాయి. బానిస బ్రతుకులకు విముక్తి లభించడం జనతా ప్రజాతంత్ర విప్లవంతోనే సాధ్యపడుతుందని గుంపస్వామి విశ్వసించారు. తెలంగాణ రైతాంగ విప్లవ పోరాటం (1946 -51) ఆధారంగా కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, తరిమెల నాగిరెడ్డి ఆధ్వర్యంలోని భారత కమ్యూనిస్టు పార్టీలో ఆయన పనిచేశారు.
'దున్నేవాడికి భూమి, భూస్వామ్య విధానం రద్దు' నినాదం కేంద్రంగా ఉండే విప్లవాత్మక వ్యవసాయ కార్యక్రమం ఈ విప్లవ పోరాటానికి ఇరునులాంటిది. కార్మిక వర్గ నాయకత్వంలో, విప్లవ వర్గాలన్నిటితో బలపైన ఐక్యతను ఏర్పర్చి నేటి భూస్వామ్య బడా పెట్టబడిదారి వ్యవస్థను రద్దు చేయడం ఈ ప్రజాతంత్ర విప్లవం లక్ష్యంగా కామ్రేడ్ గుంప స్వామి తన విప్లవ పంధాను ఎంచుకున్నాడు. మూడు దశాబ్దాలుగా గుంపస్వామి గిరిజన సంఘం కార్యదర్శిగా, యు.సి.సి.ఆర్.ఐ (కమ్యూనిస్ట్ - లెనినిస్టు) పార్టీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కమిటి సంయుక్త సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. 1970 నుంచి గిరిజన రైతాంగ పోరాటం సద్దుమణిగింది. గుంపస్వామి తాను ఎంచుకున్న విప్లవ మార్గం కారణంగా జీవితంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొన్నాడు. 1968 నుండి 1972 వరకు, 1975 (ఎమర్జెన్సీ కాలం)లో జైలు జీవితం గడిపారు. తోటి కామ్రేడ్ల సహకారంతో ఆయన చదవటం, రాయటం నేర్చుకున్నాడు. పార్టీ సాహిత్యం ద్వారా గొప్ప కమ్యూనిస్టు విప్లవ కారుడుగా ఎదిగాడు.
జైలు నుంచి విడుదలైన గుంపస్వామి 1972 నుంచి 1/70 భూబదలాయింపు చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో భూపోరాటం కొనసాగిస్తూ వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. 1978-74 లో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడైన కామ్రేడ్ తరిమెం నాగిరెడ్డే ఏజెన్సీ వర్వటనలో ఆయనతో గుంపస్వామి కీలక పోషించారు. తర్వాత కురుపాం మండలంలోని వలసబల్లె గ్రామానికి మూడు పర్యాయాలు సర్పంచ్ గా పని చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పార్లమెంటు స్థానానికి 2009లో, మరోసారి అరకు ఎంపీ స్థానానికి కమ్యానిస్టు అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే నాగూరు ఆసెంబ్లీ నియోజక వర్గానికి మూడుసార్లు పోటీ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పాలక వర్గ పార్టీలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండ గట్టారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజా నాయకుడిగా ముద్రపడిన కామ్రేడ్ ఆరిక గుంపస్వామి 2013, జనవరి 29న అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆనాటి నుంచి నేటి దాకా గిరిజనులకు భూసమస్యలే ప్రధానమైనవి. గిరిజనులు గత ముప్పై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే వారి వారసత్వ భూసమస్యల నుంచి విముక్తులవుతారు.
#ఆరిక సూర్య నారాయణ,ట్రైబల్ డెవలప్ మెంట్ మిషన్ రాష్ట్ర ఉపాధక్షులు