మాతృ భాషల అస్థిత్వ పోరు
అంతర్జాతీయంగా మాతృభాషా దినోత్సవాన్ని తొలిసారిగా 2008, ఫిబ్రవరి 21వ తేదీ నుండి జరుపుకుంటున్నాం. ప్రపంచీకరణలో భాగంగా యూరప్ లో ఎన్నో భాషలు అంతరించిపోతున్నాయని గమనించిన ఐ.రా.స 1999, నవంబర్ 17న ప్రపంచ భాషల సంరక్షణ బాధ్యతను యునెస్కో ద్వారా ప్రకటించింది. దరిమిలా ప్రజలలో విభిన్న భాషల, విభిన్న సంస్కృతుల పట్ల అవగాహన పెరగడానికి ప్రపంచ భాషల మధ్య సమగ్రతను, మాతృ భాష భావాన్ని పెంచాలని ఐరాస యునెస్కోకు ఆ బాధ్యతను అప్పగించింది."సాధారణ భావ వ్యక్తీకరణలో అసంకల్పితంగా ఉపయోగించే కారక ధ్వనుల రూపం మాతృభాష" అదే తల్లి భాష. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మానవుని మెదడులోని మాతృభాష ఇతర భాషలను తర్జుమా (అనువాదం) చేసి ఆ భావాన్ని మనసుకు అందిస్తుంది. భారతీయ సమాజం బహుళ భాషా సమూహాలతో కూడుకొని ఉంది. మన దేశంలో 1652 భాషలు, మాండలికాలు ఉన్నాయి. కాని చాలా భాషలకు ఈనాటికీ 'లిపి' లేదు. కేవలం 23 భాషల్లోనే మాట్లాడే వారు జనాభాలో 97 శాతం మంది ఉన్నారని వీటిని మాత్రమే 'అధికారిక భాషలు'గా భారత రాజ్యాంగంలోని 345 అధికరణం, 8వ షెడ్యూల్ లో చేర్చారు. వివిధ ప్రాంతాలలో, భౌగోళిక స్థితులలో, సాంఘిక, సాంస్కృతిక స్థితులలో, ఆహార నియమాలలో ఏర్పడిన మార్పులకు పలు భాషలు, భాషా కుటుంబాలు ఆవిర్భవించేలా చేశాయి. వివిధ భాషలు మాట్లాడే ప్రజల ఉనికి గమనిస్తే - ఇండో ఆర్యన్ భాషలు - 73 శాతం, ద్రవిడ భాషలు -20.30 శాతం, ఆస్ట్రిక్, యూరోపియన్ భాషలు - 1.38 శాతం, సైనోటిబెటన్ భాషలు - 0.85 శాతం, ఇతర భాషలు మాట్లాడే వారు 4.47 శాతం ఉన్నారు.
* అధికారిక ప్రాచీన భాషలు
మాతృభాషల గుర్తింపులో భాగంగా మొదటగా- 1948 మార్చి 21న పాకిస్థాన్ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ అధికారిక భాషగా ఉర్దూను ప్రకటించారు. తూర్పు పాకిస్థాన్, బంగ్లాదేశ్ గా విడిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో 'బంగ్లా భాష' మాట్లాడసాగారు. వారిపై ఉర్దూ మాట్లాడమని ఒత్తిడి చేసేవారు. బంగ్లా భాషను బంగ్లాదేశ్ ప్రధాన భాషగా నిర్ణయించుకుని 1952, ఫిబ్రవరి న విద్యార్థులు పోరాటం చేపట్టారు. ఈ ఉద్యమం తర్వాత ఐరాస ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషలను గౌరవించాలని మాతృభాష చరిత్రను, సంస్కృతిని కాపాడాలని పేర్కొంటూ 2010 సంవత్సరాన్ని "International year for the Rapproachment of Culture" గా ప్రకటించారు. భారత ప్రభుత్వం సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న భాషలను భాషా సంస్కృతులను, సాహిత్యాన్ని గౌరవించాలని, భవిష్యత్తరాలకు భాషా సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో 2004లో భారత రాజ్యాంగం 351వ ఆర్టికల్ ప్రకారం తమిళం, సంస్కృతానికి 2005లో ప్రాచీన హోదా కల్పించారు. అలాగే కన్నడ, తెలుగు భాషలకు 2006వ సంవత్సరంలో ప్రాచీన హోదా కల్పించారు. తేనెలొలికే తేట తెలుగు భాష అజంత భాష. ఇది సరళమైన, పొందికైన, సువర్ణ సుందర భాష. కాబట్టి తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్"గా పేరెన్నిక గన్నది. తెలుగు పాట, మాట, పద్యం, హరికథ, అవధానం, సాహిత్యం, నాటకం సుమధురమైనవి. ప్రాచీనులు మనకందించిన ఆ ఆణిముత్యాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది.
* మాతృభాషల మనుగడ ?
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో మాతృభాషల మనుగడ నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు మరో ప్రక్క అమెరికన్ సామ్రాజ్యవాద విష సంస్కృతి తాకిడికి బలవుతున్న మాతృభాషల ఉనికి, మనుగడ కనుమరుగవ్వక తప్పని పరిస్థితి దాపురించింది. ఇందులో ప్రధానంగా ఆదిమ తెగల భాషలు - వారి సాంస్కృతిక సంప్రదాయాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆఫ్రికా, ఇండోనేసియా, అండమాన్ నికోబార్ దీవుల్లో అదిమ తెగలే ఏకంగా అంతరించిపోతున్నాయి. ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి వంటిది. పరాయి భాష ప్రియురాలి వంటిది. నేటి యువత ప్రేమ, వ్యామోహం ముసుగులో మాతృభాష పరాయికరణ చెందడం సాధారణమైంది. ముఖ్యంగా ఆంగ్ల భాష, ప్రపంచ భాషగా అంతర్జాతీయంగా రూపాంతరం చెందింది. ఇది సకల భాషా సాహిత్యానికి ఒకే వారిథిగా ఉండటమే! అంతర్జాతీయ భాషగా ఎదగడానికి కారణం. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల భాషలు ఉండగా ఆంగ్లాన్నే ఆదరించడం వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రలో భాగం.
*ఆదివాసీ భాషలకు నిరాధరణ
ప్రపంచంలో సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తున్నది కేవలం ఆదివాసీలేనన్నది ఆది(మ)సత్యం. భాషకు, సంస్కృతికి- అవినాభావ సంబంధం ఉంది. కాని వారి మాతృభాషకు, లిపికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి భాష ద్వారానే సంస్కృతి - సంప్రదాయాలు - ఆచారాలతో ఆదివాసీలు అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కాని పాలక వర్గాలు ఆదిమ జాతుల భాషలకు లిపి లేదన్న సాకుతోనే ఇతర భాషలను రుద్దడంతో విద్యాభివృద్ధికి, సమగ్రాభివృద్ధికి దూరమయ్యారు. ఈ విభిన్న జాతుల ఉనికిని ధ్వంసం చేస్తూ, పాలక వర్గాలు ఒకేస్థాయి సంస్కృతిని స్థాపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
ఒక భాషను మరొక లిపిలోనూ రాయవచ్చు. భాషాభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి అవసరం. ఈ తేడాను నిజాం రాజులకు, నేటి పాలకుల చిత్తశుద్ధిని చూస్తే తెలుస్తుంది. మాతృభాషల సంరక్షణలో భాగంగా నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ఆదివాసీల ప్రత్యేక సంస్కృతిని గుర్తించి పాఠశాల స్థాయిలో తెలుగు లిపిలోనే శిక్షణనిప్పించి గోండు భాషలను పరిచయం చేశారు. వారి మాతృభాష శిక్షణ కోసం మార్లవాయిలో టీచర్ ట్రైనింగ్ సెంటర్ ను స్థాపించారు (హైమండార్ఫ్ కాలంలో). కాని 1958లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో విలీనమై, భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఆదివాసీ గిరిజన పిల్లల మీద తెలుగు బలవంతంగా 'రుద్ద' బడింది. కాకతీయుల కాలం (13వ శతాబ్దం)లో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ దండకారణ్యంలో కోయ గిరిజనులు మాట్లాడే కోయ భాషను కాకతీయ రాజులు అంతరింపజేశారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కొండ ప్రాంతాల్లో నివసించే సవర జాతి గిరిజనులు మాట్లాడే 'సవర భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పాఠశాలల్లో ప్రభుత్వ ఆదరణ లేక సవరల భాష అంతరిస్తోంది. కొన్ని రాష్ట్రాలోని గిరిజన జాతులకు ప్రాచీన భాష ఉంది. కానీ లిపులు లేవు. అందుకే ఆదివాసీల భాషలు నోటి భాషలుగా మిగిలి అంతరిస్తున్నాయి. గిరిజన గోండీ భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చలాయించాయి. అందుకు సాక్ష్యమే ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూరు మండలం గుంజాలలో పురాతన గోండీ లిపి ప్రతులు లభ్యమయ్యాయి. ఈనాటికీ గోండీ లిపి వచ్చిన ఐదుగురి గిరిజనులతో గుంజాల గోండీ లిపి' పేరుతో పాఠశాల స్థాపించారు. ఇలా తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం కాని, భాషా పండితులు పురాతన, ఆదిమ భాషల పరిరక్షణకు కృషి జరగడం లేదు. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఫలితంగా ప్రభుత్వం తెలుగు భాషకు ప్రత్యేక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. కాని ఆ మహా సభల్లో ప్రాంతీయ భాషలు, మాతృభాషల లిపి గురించి పట్టించుకోలేదు.
* భాషా పరిరక్షణ - బాధ్యత
తక్షణావసరంగా ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధి కార భాషలుగా గుర్తించాలి. రాష్ట్రాల్లో అమలవుతున్న మాతృభాషలలో ముఖ్య పరిపాలన వ్యవహారాలు కొనసాగాలి. అంత రించిపోతున్న ఆదిమ భాషలను గుర్తించి, వాటి లిపిపై అధ్యయనం అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుండి విశ్వ విద్యాలయాల వరకు విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగాలి. న్యాయ స్థానాల్లోనూ కోర్టు తీర్పులు వారి వారి మాతృభాషల్లో వెలువడినట్లయితే గ్రామీణులు సైతం న్యాయం పొందుతారు. అలాగే ప్రాంతాల వారీగా మాండలికాలను, యాస, ప్రాస ఉచ్ఛారణలను సేకరించి వాటిని సమన్వయ పరచాలి. ఇలాంటి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. దీనికి తోడు ప్రజాస్వామికవాదులు, మేధావులు , భాషా పండితులు, విద్యావంతులు మాతృభాష మనుగడకు కృషి చేస్తే తల్లి భాషలకు మరింత మాతృత్వం లభించినట్టవుతుంది.
# గుమ్మడి లక్ష్మీ నారాయణ, సెల్ :9491318409
( ఫిబ్రవరి 21 : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం )
0 Comments