# వివాహ బంధం పటిష్టపరచాలి ! #
మానవ జీవితంలో ముడిపడిన అన్యోన్య బంధం వివాహం. పెళ్లిళ్లు భారతీయ సంస్కృతికి, సహజీవనానికి ఆనవాళ్ళు. పెళ్లిళ్లకు ప్రత్యేకించినది మాఘమాసం. పురోహితులు సూచించే శుభ ముహుర్తాలను బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. హిందూ సమాజంలో దాగివున్న పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా సాగే వివాహ మహోత్సవానికి మన దేశంలో సముచిత ప్రాధాన్యత, విలువ, గౌరవం ఉంటుంది. ఇప్పటికీ భారతీయులు వైవాహిక జీవిత విలువలను దైవ స్వరూపంగా పాటిస్తారు. ఇలాంటి వివాహ బంధాలు కొన్ని ఈ మధ్య కాలంలో విడిపోతున్న సందర్భాలు కుటుంబ పెద్దలను కలవరపెడుతున్నాయి. లక్షల కట్నాలతో లక్షణమైన సంబంధాలు వెతికి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి సంక్షోభం మనోవేదనను కల్గిస్తున్నది.
ఆలుమగల మధ్య అవగాహన లోపిస్తే, సంయమనం లేకపోతే సంసారం నిస్సారమవుతుంది. భార్యాభర్తల విభేదాలు వివాహబంధాన్ని విడదీస్తాయి. చివరికి విడాకులకు దారి తీస్తుంది. ప్రపంచ దేశాలతో పొల్చితే కేవలం ఒక శాతం విడాకులతో అత్యల్పంగా నమోదైన దేశంగా ఇండియాకు పేరుంది. గరిష్టంగా విడాకులు బెలారస్ దేశంలో 68 శాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేటులో చైనా 2.2 శాతం, ఇటలీ 2.7 శాతం, కెన్యా 15 శాతం ,బ్రెజిల్ 21 శాతం , అస్ట్రేలియా 38 శాతం, స్విస్ 40 శాతం, జర్మనీ 41శాతం , కెనడా 45 శాతం, అమెరికా 49 శాతం, ఉత్తరకొరియా మరియు నూజిలాండ్ 53 శాతం, బెల్జియం 56 శాతం , స్వీడన్ 64 శాతం , రష్యాలో 65 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడాకుల పెరుగుదల రేటు 1960లో 12 శాతం, 1980లో 26 శాతం , 2000 లో 25 శాతం, 2010 లో 41 శాతం, 2017 లో 44 శాతం, 2020 నాటికి 51.8 శాతంగా నమోదు కాబడింది. గత మూడేళ్ళలో వివాకుల రేటు 7.8 శాతం పెరుగుదల గమనార్హం.
ఇండియాలో విడాకుల రేటు పూర్వంతో పోల్చితే క్రమంగా పెరుగుతోందని సంబంధించిన నిపుణులు వెల్లడిస్తున్నారు. మనదేశంలో విడాకులకు ముఖ్య కారణాలు- వివాహేతర సంబంధాలు, ఇరువురి మధ్య విశ్వాసం సన్నగిల్లడం, సంక్షోభాలు, బాల్యవివాహాలు, వితండ వాదనలు, ఆర్థిక సమస్యలు, చిర కాలంగా దంపతుల ఎడబాటు , గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక సమస్యలు, అహంభావ దోరణి, మానసిక వైకల్యం, సర్దుకునే దోరణి లేకపోవడం వంటివి ప్రముఖమైనవి. దేశ జనాభాలో 0.11 శాతం అనగా 1.36 మిలియన్ల మంది వివాహితులు విడాకులు తీసుకున్నారు. వారిలో పురుషుల కన్నా స్త్రీలు అధికం. దేశంలో విడాకుల సంఖ్య రాష్ట్రాల వారీగా మిజోరాం (6.34 శాతం ),మేఘాలయా (4.11శాతం ), సిక్కిం (2.16శాతం), కేరళ (1.59శాతం ), మణిపూర్ (1.32శాతం ), తమిళనాడు (1.22శాతం ), మహారాష్ట్ర (1.08శాతం ), వెస్ట్ బెంగాల్ (1.02శాతం ), ఆంధ్ర ప్రదేశ్ (1.12శాతం ), గుజరాత్ లో 1.08 శాతంగా ఉంది. ఈ విడాకుల సంఖ్య గ్రామీణుల కంటే పట్టణవాసుల్లో , మద్యతరగతి కుటుంబాలలో , అందులోనూ విద్యాధికుల్లోనే నమోదు అధికం. విదేశీయుల్లో కంటే భారతీయుల్లో విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి ప్రదాన కారణం పూర్వం నుండే విడాకులనేది ఓ సామాజిక దురాచారంగా గుర్తించబడింది. విడిపోయి జీవించటం అనేది ఒక అసామాజికమైనదిగా, దుస్సంస్కృతిగా భావించబడుతున్నది. వివాహేతర సంబంధాల్లో పురుషులు 75 శాతం, స్త్రీలు 25 శాతం విడాకులు తీసుకుంటున్నారు. అందులోనూ 10 నుంచి 15 సంవత్సరాల వైవాహిక జీవితం గడిచిన తర్వాత 53 శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. 20ఏళ్ళకు పైగా వైవాహిక జీవితం గడిపిన వారిలో విడాకులు చాలా అరుదుగా కన్పిస్తున్నాయి. భారత్ లో వివిధ మతాల వారు హిందూ వివాహ చట్టం -1955 ను అనుసరిస్తున్నారు. ముస్లిమ్ విడాకులు ముస్లిం వివాహ చట్టం -1939, క్రిస్టియన్లకు భారతీయ విడాకుల చట్టం-1963, కుల మతాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం-1954 చేయబడ్డాయి. ఇతర కారణాలతో పోల్చితే ఉభయుల అంగీకారంతో విడాకులు తీసుకోవడం సులభంగా జరుగుతోంది.
గిరిజన తెగలలో వారి సంస్కృతి, ఆచారాలలో జరిగే వివాహ వ్యవస్థ ఆదర్శవంతమైనవి. భిల్లు, గొత్తికోయ వంటి గిరిజనులు ఆర్థిక వెసులుబాటు లేక సహజీవనంతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధ్యయనం చేసిన ఝార్ఖండ్ లోని 'నిమిట్టా' అనే స్వచ్చంద సంస్థ 2016లో 200 జంటలను చేరదీసి పెళ్ళి చేసింది. వెంటనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేపించడంతో ఆ మహిళలకు చట్టబద్దమైన హక్కులు లభించాయి. ఉత్తరాది రాష్ట్రాలలో వివాహ సంప్రదాయాలను పాటించాలని, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ హితమైన పెళ్ళిగా ' రాధాసోమి ' అనుసరిస్తున్నారు. ఈ వివాహ సంప్రదాయంలో శుభలేఖ ఖర్చు రూ.5, భోజనాలు ప్లేటుకు రూ. 13 కు మించడానికి వీల్లేదు. అమ్మాయి తరపు అతిధితులు 65 మంది , అబ్బాయి తరపు బంధువులు 85 దాకా హాజరు కావాలి. ఈ రాథాసోమి అనేది ఉత్తరాధిన బహుళ ప్రాచుర్యం పొందిన అనేక ఆధ్యాత్మిక తెగల్లో ఇదొకటి. ప్రేమ పెళ్లిళ్ల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు సమాజ ఆమోదయోగ్యంగా ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో మూడుముళ్ల వివాహ బంధం పట్ల పవిత్రత, పితృసామ్య వ్యవస్థ, వివాహిత ఇంటికి పరిమితం కావడం, సామాజిక విలువలు, గ్రామపంచాయతీ తీర్పులు, లింగ సమానతలు, పెద్దల మాటలు పాటించటం వంటివి మనదేశంలో విడాకుల రేటు తక్కువ నమోదుకు తోడ్పడుతున్నాయి.
భారత హిందూ పవిత్ర వివాహబంధం మూడు పువ్వులు ఆరు కాయటంగా వర్ధిల్లుతూ, కుటుంబంలో నవ్వుల పువ్వులు పూయాలి. ప్రపంచ దేశాలకు బారతీయ వివాహవ్యవస్థ దీప స్తంభం కావాలి. ప్రస్తుత వివాహ వ్యవస్థలో ఆశించిన మార్పులు రావాలంటే సాంస్కృతికంగా సంప్రదాయంగా పెళ్లిల్లు రూపుదిద్దుకోవాలి. బాల్య వివాహాలను నిరోధించడానికి పేద, కార్మిక కుటుంబాలలో వ్యసనాలను తగ్గించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వివాహబంధం పటిష్ఠతకు అవసరమైన కౌన్సిలింగ్ కేంద్రాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలి. నవ దంపతులకు ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించాలి. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును బట్టి మదుపుతో, కాలుష్యానికి తావులేకుండా పర్యావరణ హితంగా, ఆరోగ్యకర వాతావరణంలో పెళ్లిల్లు జరిగితే శుభకరం !
గుమ్మడి లక్ష్మీ నారాయణ
9491318409
0 Comments