//తెలంగాణ ఉద్యమ పునాది రాయి//
ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దనరావు తెలంగాణ సకల జనుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ఆది నుంచీ ఆదర్శ భావాలతో మెలిగిన ఆయన జీవితం, తొలి ఆనుబంధం ఆదివాసులతోనే. మలి అనుబంధం తెలంగాణ కోసం సాగింది. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో బియ్యాల కిషన్ రావు, ఆంజనమ్మ దంపతులకు 1955 అక్టోబర్ 12న జన్మించారు. బాల్యంలోనే జనార్ధన్ రావు కుటుంబం ఏజెన్సీ కొత్తగూడెం మండలంలోని ఓటాయి గ్రామానికి వలస వెళ్ళడంతో ఆయన ఓటాయి వాసిగానే సుపరిచితుడు. పేద కుటుంబం, కష్ట నష్టాలు చదువుకు అడ్డం కాదంటూ తన పొరుగు గ్రామమైన సాధి రెడ్డిపల్లిలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. పదవ తరగతి నర్సంపేటలో, ఇంటర్ విద్య గోదావరిఖనిలో, డిగ్రీ హన్మకొండ ఎల్బీ కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ)కాకతీయ యూనివర్సిటీలో కొనసాగింది.చిన్ననాటి నుంచి తను ఏజెన్సీ గ్రామంలో నివసించడం మూలాన, ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సంప్రదాయ వారసత్వ జీవన విధానమును ఆకళింపు చేసుకున్నారు. మరోపక్క ఏజెన్సీవాసుల భూములు, అటవీ వనరులు పరాయికరణ చెందడంతో ఆవేదన చెందారు. ఎలాంటి చైతన్యం లేని ఆదివాసీలకు చెందిన భూములు 1980లో 48 శాతం వలస గిరిజనతరులు, పెత్తందార్లకు ఆన్యాక్రాంతమయ్యాయి. ఆ దశలో ఆదివాసీల భూ సమస్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి తోడ్పాలనే సంకల్పంతో కృషి చేశారు. బియ్యాల 1983లో కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడుగా చేరిన ఆయన ఆదివాసులపై లోతైన పరిశోధనలకు పూనుకున్నారు. ఆయన 'గిరిజన భూముల పరాయికరణ' అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్డీ పట్టా పొందారు. తదనంతరం 1990 నుంచి ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమస్యలపై దృష్టి పెడుతూ.. అదివాసులపై పరిశోధన చేసిన తొలి గిరిజనేతర వ్యక్తి. సామాజిక స్పృహతో 82 జాతీయ సెమినార్ లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలలో జరిగిన 11 అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.
"మట్టిపూలు', 'ఆదివాసీ సమాజం-సమస్యలు', 'ఆదివాసులు - స్వయంపాలన, భారతదేశంలో ప్రభుత్వం భూస్వామ్య రైతులు' అనే పుస్తకాలను, 42 వ్యాసాలను ప్రచురించారు. 1888-85 మద్యకాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్' న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. ఆయన వివిధ జాతీయ స్థాయి పరిశోధనా అధ్యయన కమిటీలలో సభ్యులుగా ఉంటూ, జర్మనీ సామాజిక శాస్త్రవేత్తల సహకారంతో మూడవ ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ - అభివృద్ధి, శ్రామీణ గిరిజన తెగల అదివాసీల సమాజాల అధ్యయనం, దేశీయ వనరుల వినియోగం, వలసవాద సమకాలీన ప్రభుత్వ విధానాల విశ్లేషణ వంటి వాటిపై తన పరిశోధనా దృష్టిని సారించారు.2001 కాలంలో కాకతీయ యూనివర్సిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్ గా నియమితులయ్యారు.
బియ్యాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి సిద్ధాంతకర్తగా భూమిక పొషించారు. తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణచివేతల గురించి అనేక రచనలు చేశారు. అదే కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ తో కలిసి అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అసమానతలు ప్రాంతీయ అసమానతలపై ప్రసంగించి తెలంగాణ ఉద్యమానికి అంతర్జాతీయంగా సమ్మతిని కూడగట్టారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు - నియామకాలు పంపిణీల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటిసారిగా లేవనెత్తిన ఘనత జనార్దన్ రావుకు దక్కుతుంది. సమైక్యపాలనలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు, ఎట్లా ఉల్లంఘించ బడ్డాయో ఎండగడుతూ, విద్యార్థులు, మేధావుల్లో ప్రచారం చేయడంలో ప్రొఫెసర్ జనార్దన్ రావుదే ప్రధాన భూమిక. జనార్ధనరావు ఒకరు తెలంగాణ కోరితే రాష్ట్రం ఏర్పడుతుందా? అన్న ప్రశ్నలను సైతం సంధించుకుని తన సహచరి ప్రొఫెసర్ రేవతి తోడ్పాటుతో ముందడుగు వేశారు. ఉద్యమాచరణలో ముందున్నారు. మూడు తరాల ప్రతినిధి కాళోజీ , ప్రొఫెసర్ జయశంకర్ తో సమఉజ్జీగా నిలిచి వారితో కలిసి ఉద్యమంలో పనిచేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి' ఉద్యమ పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గౌరవ కేసీఆర్ తో కలిసి పార్టీ మేనిఫెస్టోను రూపొందించడంలో పాలుపంచుకున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో, ప్రజాపరిపాలన, శాంతిభద్రతల విషయంలోనూ ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు. 1909 లో కన్నబిరామ్ , ఎస్ఆర్ శంకరన్ తదితరులతో కలిసి ప్రభుత్వం తరుపున నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనే ఎజెండా ముందుకు తెచ్చారు. ఆదివాసీలను చైతన్య వంతులను చేస్తూ ఆదివాసీ ఉద్యమంతోపాటుగా, తెలంగాణ ఉద్యమానికి జనార్ధనరావు ఎనలేని సేవలు చేశారు. బియ్యాల జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తపన పడ్డారు. గిరిజనుల స్వయం పాలన కోసం రాజరికపు వ్యవస్థపై వీరోచితంగా పోరాడి నేలకొరిగిన 'సమ్మక్క- సారక్క' జాతర జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ బియ్యాల జానార్ధనరావు 2002 ఫిబ్రవరి 27న ప్రకృతి ఒడిలో చేరిపోయారు. జనార్ధన్ రావు ఉద్యమ స్ఫూర్తి ఆదివాసీ గిరిజనుల గుండెల్లోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ సజీవంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ఉద్యమ కార్యకర్తగా, యావత్ తెలంగాణ ప్రజల మదిలో అనుక్షణం మెదులుతూనే ఉంటారు.
గుమ్మడి లక్ష్మీ నారాయణ( ఆదివాసి రచయితల వేదిక ),సెల్ :9491318409
(ఫిబ్రవరి 27 : బియ్యాల జనార్ధన్ రావు వర్థంతి )
0 Comments