* ఆరోగ్యానికీ అందలం ! *
'అందరికీ ఆరోగ్యం అందుబాటులో వైద్యం ' అని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది . ఆరోగ్య రంగంలో పలు సంస్కరణలు తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కార్ నియమించిన హైలెవెల్ కమిటీ 120 పేజీల నివేదికను మూణ్ణెల్ల క్రితం ప్రభుత్వానికి సమర్పించింది . రాజ్యాంగం ప్రకారం ' ప్రజారోగ్య వ్యవస్థ ' అనేది ఇన్నాళ్లు రాష్ట్రాల జాబితాలో ఉంది . ఇకపై కేంద్ర , రాష్ట్రాల పరిధి నుండి ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చి పౌర సమాజానికి ఆరోగ్య ధీమా కల్పించే చర్యలు వేగవంతం చెయబోతోంది కేంద్ర ప్రభుత్వం . తద్వారా ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనాన్ని నివారించి కేంద్రమే అజమాయిషీ ప్రదర్శించే ఆలోచనకు పదును పెడుతోంది . ఈవిధంగా రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో మెడికల్ సీట్లను , ఆసుపత్రుల సంఖ్యను యుద్ధ ప్రాతిపదికన పెంచే యోచనతో కేంద్రం అడుగులేస్తోంది .
* నివేదిక సారాంశం*
15 వ ఆర్థిక సంఘం ఏర్పాటుచేసిన ఈ హైలెవల్ కమిటీ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్ వాటాకి జాతీయోత్పత్తి (జీడీపీ )లో 2.5 శాతానికి పెంచాలని సూచించింది . ఇంకా ఈ నివేదిక ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో ఆసుపత్రులను నెలకొల్పాలంటే అయా రాష్ట్రాల సానుకూల దృక్పధం అవసరం . తగిన భూములు కేటాయించాలి. విద్యుత్ , నీటి , భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ అనుమతులు వంటివి సకాలంలో మంజూరీ చేయబడాలి . ఉదాహహరణకు ఒక 200 పడకల ఆసుపత్రి నిర్మించబడాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది గనుక చాలినంత బడ్జెట్ లేని సంస్థల కోసం - రైతులకు అత్యల్ప
వడ్డీకే రుణాలిచ్చినట్లు వీటికి కూడా రుణసౌకర్యం కల్పించాలి . సామాన్య ఇంటి వాడుక రేట్లకే నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా క్లియరెన్స్ సాధించబడాలి . ఈ పనుల సానుకూలతలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయము తప్పనిసరి . ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రం ముఖ్య సలహాదారైన నీతిఆయోగ్ రూపొందించిన అడ్వైజరీ నోట్ ను కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సిఫారసు చేసింది .
*ఆరోగ్య భీమా - పేదలకు ధీమా *
దేశంలో ఆర్థిక వెసులుబాటులేని నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య ధీమా అందించడమే లక్ష్యంగా మోదీ ' ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజీఎవై ) పధకాన్ని 2018 , సెప్టెంబర్ 23 న రాంచీలో ప్రారంభించారు . 'ఆయస్మాన్' లో అంతర్భాగమైన ఈ పథకం ప్రకారం ఒక్కో కుటుంబానికీ ఏడాదికి ఐదు లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తారు . కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ వైద్యానికి అర్హత వున్న ఈ పథకానికి కేంద్రమే నిధులు సమకూరుస్తుంది . అమలు చేయడం మాత్రం రాష్ట్రాల పరిధిలో ఉంటుంది . రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ పౌరునికి ఉచిత విద్యతో పాటు వైద్యం పొందడమూ ప్రాథమిక హక్కు . 2020 ఆగష్టు 15 నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో - ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కుగా ప్రసాదించాలని మోఢీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది . రానున్న ఐదేళ్లలో ఈ లక్ష్యం సాధించడానికి దేశవ్యాప్తంగా మూడు వేల నుంచి ఐదు వేల వరకు 200 పడకల సామర్ధ్యం గల ప్రెవేట్ హాస్పిటళ్లను అదనంగా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది . 2025 నాటికీ వైద్యుల , పారామెడికల్ సిబ్బంది కొరతను నివారించేందుకు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు చేసి సరిసమానమైన పీజీ మెడికల్ సీట్లను పెంచే ప్రయత్నాలు వేగిరం అవుతున్నాయి . ప్రైవేట్ సంస్థలు కొత్త దవాఖానాలు టయర్-2 , టయర్-3 పట్టణాల్లో మరియు వైద్యసేవలు మృగ్యమైన మారుమూల గ్రామాలలో , షెడ్యుల్డ్ ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటుకు కొన్ని రాష్ట్రాలు సానుకూల వైఖరి ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త " ఇండస్ట్రీ - ఫ్రెండ్లీ " సూత్రాన్ని ప్రతిపాదించింది . దీనికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయింపు చేయడమే తరువాయి . అబ్దుల్ కలాం చేప్పినట్లు సామాన్యుల దాకా వైద్యం చేరాలి. దేశాభివృద్ధికి పట్టుగొమ్మలైన పల్లెల్లోనూ దవాఖానాలు నిర్మిస్తే గ్రామీణ ఆరోగ్యం మెరుగవుతుంది . మండల కేంద్రాల్లోని పి.హెచ్. సి.లను 30 పడకల ధర్మాసుపత్రులుగా ఉన్నతీకరించాలి . ప్రభుత్వ ఆసుపత్రులపైనా, వైద్యుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా అన్నీ వైద్య సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి. అతిప్రాధాన్యతగా ప్రత్యేక పారితోషికంతో గ్రామీణ వైద్యులను ప్రోత్సహిస్తూ , వారి కొరతను నియామక ప్రక్రియ ద్వారా అధిగమించాలి . గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు స్థానికంగా క్వార్టర్లు నిర్మించాలి . నియోజక వర్గానికొక శిక్షణా వైద్యశాలను నెలకొల్పాలి . గామీణ ప్రాంతాలలోని బడుగు ప్రజలు , దళిత , గిరిజన ,మైనారిటీలకు 30 శాతం ప్రత్యేక మెడికల్ సీట్లు కెటాయించాలి. కరోనా వైద్యం పేదలకు చేరాలంటే ' ఆరోగ్య శ్రీ ' లో చేర్చాలి. ఇత్యాది సౌకర్యాలన్నీ సఫలీకృతంగా , సవ్యంగా సమకూరితే ప్రజల చెంతకీ ఉచిత వైద్యం చేరటం గగన మేమి కాదు .
0 Comments