ఆగష్టు 9 ప్రపంచ ఆదివాసీ  దినోత్సవం సందర్బంగా.....  
                                       * ఆదరణ కోల్పోతున్న ఆదివాసీ 'వైవిధ్యం' * 

                                                              జీవ వైవిధ్యానికి  ఆదివాసీ ప్రాంతాలే  ముఖ్య  స్థావరాలు  అన్నది గతకాల వైభవంగా మారిపోయింది. ప్రకృతి ఒడిలో కొండలు, కోనలు, నదీనదాల మధ్య పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అలరారిన గిరిజన తెగలు 'నాగరికత-అభివృద్ధి' ముసుగులో విధ్వంసానికి గురై తరిగిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వందలాది  గిరిజన తెగలు అంతరించిపోగా, మిగిలిన తెగలు కనీస వసతులకు కూడా నోచుకోక బతుకు భారమై కనుమరుగైపోతున్నా యి. అడవులు, సముద్ర తీరప్రాంతాలపై ఆదివాసుల సహజ హక్కును గుర్తించి, వారి భాషతోపాటు సంస్కృతి, జీవన విధానాలను పరిరక్షించడంలో ఇప్పటి దాకా జరిగిన పదకొండు  అంతర్జాతీయ 'జీవ వైవిధ్య' సదస్సులు ఆచరణలో సాధిం చింది శూన్యమనే చెప్పాలి. 2013 హైదరాబాద్ మహానగరంలో జరిగిన  11వ మహాసభ కూడా   ఇదే తీరుకు ప్రదర్శించింది . ప్రస్తుతం కరోనా సంక్షోభంలో  చిక్కుకున్న ఆదివాసీల  యొక్క  వారసత్వ ఉపాధికీ  గండి పడింది. అస్వస్థకు గురైన చోట్ల వారిని ఆసుపత్రికి చేర్చడానికి ఇంకా జోలెకట్టు విధానమే గోచరిస్తుందంటే ఆదివాసీల దుర్బర స్థితికి అర్థం చూసుకోవచ్చు  .

                                                  ఆదివాసీ గిరిజన తెగల సంస్కృతిని , జీవించే హక్కును హరించడంలో మనదేశం కూడా మినహాయింపు కాకపోవడం బాధించే అంశం. ఆది భారతీయులుగా వెలుగొందాల్సిన ఆదివాసీలు, నిత్యం నిరాదరణకు గురవుతున్నారు. ప్రకృతి వనరులు పొంగిపొరలే ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలు కనీస వసతులకు కూడా నోచుకోవడం లేదు. పారిశ్రామికీకరణ ఆదివాసీల మనుగడకు   పెనుముప్పుగా పరిణమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల్లో వివిధ పేర్లతో విస్తరించిన 5  వేల తెగలకు చెందిన ఆదివాసుల సంఖ్య 37 కోట్లకు పైమాటే. ఆస్ట్రేలియాలో 'అబోరిజన్లు', న్యూజిలాండ్ లో 'మావోరీలు', జపాన్లో 'అయినీలరు', ఉత్తర దక్షిణ అమెరికాల్లో 'రెడ్ ఇండియన్లు', ఆఫ్రికాలో 'బుష్మెన్'; కెనడాలో 'క్యూబిక్'  వంటి  విభిన్న  పేర్లతో  గిరిజన తెగలు జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటికే వారు మాట్లాడే అనేక భాషలు అంతరించిపోయాయని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ ఆంత్రోపాలజిస్టు హెర్బర్ట్ రిష్లీ  భారతదేశంలోని ఆదివాసీలు  ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్ జాతికి చెందిన వారని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఆదివాసీల 9.8 శాతం. అంటే దాదాపు 10 కోట్ల 4 లక్షల  మంది. వీరిలో సంతాల్, భిల్లు, బోటియా, నాగా, ముండా, హో, ఒరాన్లు, గోండు, కోయ, సవర, చెంచు వంటి  461తెగలు ఉన్నాయి.

                                          ఆదివాసీల అభివృద్ధికి ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలను ఆమోదించింది. 1992, ఆగస్టు 9 న జెనీవాలో 26 స్వతంత్ర మానవ హక్కుల సంఘాలు సమావేశాన్ని నిర్వహించి వారసత్వ, అటవీ వనరుల హక్కులపై చర్చించింది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, భూమి సమస్య, పర్యావరణం వంటి అంశాలపై విస్తృ తంగా చర్చించిన అనంతరం, 1993  లో ఒక తీర్మానం చేసింది. ఆదివాసులకు తగిన గుర్తింపు లభించేలా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఏడాది ఆగస్టు 9 న అధికారికంగా 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవం' జరుపుకోవాలని ప్రకటించింది. 1994 - 2004 ను ఆదివాసుల దశాబ్దంగా పేర్కొం టూ, వారి అభివృద్ధికి ముసాయిదాను రూపొందించింది. ఆదివాసీలకు స్వయం పరిపాలన హక్కు, వివక్ష నుంచి స్వేచ్ఛ, భాషా-సంస్కృతి పరిరక్షణ ఒక హక్కుగా, విద్యా - వైద్య - సమాచార సదుపాయాలు, భూమితో సహా సహజ వనరులపై హక్కు, సొంత వ్యవస్థలను నిర్వహించుకునే హక్కు అందులో ముఖ్యమైనవి.  ప్రపంచంలోని 140  దేశాలు ఈ తీర్మానంపై సంతకాలు చేశాయి. కానీ మానవ హక్కుల గురించి అన్ని దేశాలకు హితబోధ చేసే అమెరికా మాత్రం ఈ తీర్మానంపై సంతకం చేయకపోవడం విడ్డూరం . మన దేశం సంతకం పెట్టినప్పటికీ  విస్తృత ప్రచారం  చేయలేదు సరికదా దేశంలో జీవ వైవిద్యం గల ఆదిమ తెగలు కనుమరుగవుతున్నా ...ఐ.రా.స. ధ్యేయాన్ని నీరుగార్చేలా  వారి సంరక్షణను గాలికొదిలేసిన ప్రభుత్వం అదే రోజును 'క్విట్ ఇండియా' ఉత్సవానికే  పరిమితం చేయడం అతిపెద్ద వైరుధ్యం. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివాసీ  దినోత్సవం 2009 ,ఆగస్టు 9 న భద్రాచలంలో గిరిజనులకు హక్కు పత్రాలిచ్చిన ఘనత ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ కు దక్కగా ఈ యేడు జరగబోయే అధికారిక  కారక్రమం  కూడా  ఆంధ్రప్రదేశ్ చేజిక్కించుకోవడం  విశేషం. ఇదే బాటన మిగతా రాష్ట్రాలు సంకల్పించుకోవాలి.

                                         రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం - 2006 ను  అటకెక్కించడంలో, అటవీశాఖ అధికారులే సూత్రదారులు కావడం విచారకరం. గిరిజనుల అభ్యర్థనలను పరిశీలించడానికి ఏర్పడిన గ్రామ కమిటీ, సబ్ డివిజనల్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలలో గిరిజనేతరులదే  ఇష్టారాజ్యం. ఆర్టికల్ 5 ప్రకారం ఆదివాసీలకు అడవిపై  పూర్తి  హక్కు ఉంది. కానీ  అటవీశాఖ వారి  వారసత్వ పోడు వ్యవసాయాన్ని అడుగడుగునా  అడ్డుకుంటున్నది. యురేనియం  నిక్షేపాల  వెలికితీతతో చెంచులను  అడవి నుంచి గెంటివేస్తున్నారు.  ఇప్పటి వరకు గిరిజనుల అభివృద్ధికి,  సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులు వారికి  ఎందుకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నాయో ప్రభుత్వం పరిశీలించాలి. గిరిజన ఉప ప్రణాళిక(టీఎస్పీ)  ప్రకారం 6.8 శాతం గిరిజన నిధులు అందుబాటులో ఉండగా, కేవలం 3 శాతమే ఖర్చు చేస్తోంది . గతంలో  మిగిలిన నిధులు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ఆధునీకరణ, హుడా పార్కులు, అతిధి గృహాల    నిర్మాణాలకు దారి మళ్లించింది. కనీస సౌకర్యాలను కల్పించలేని    ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు  ఈ ప్రణాళికను  పారదర్శకంగా అమలు జరపడానికి అవసరమైన నోడల్ ఏజెన్సీ లేదు. దీంతో గిరిజన ఉప ప్రణాళిక  అమలు , గిరిజన సాధికారత ఒక ప్రహసనంగా మిగిలిపోతోంది. తెలంగాణలో  గిరిజన  యూనివర్సిటీ ఆరంభం దోబుచులాటలోనే  ఉంది.  షెడ్యూల్డ్  ఏజెన్సీ ప్రాంతాలలో ఐదో షెడ్యూల్ 244 అధికరణ  ప్రకారం  రాజ్యాంగ బద్ధ పరిపాలన  అందించడానికి గవర్నర్ పూనుకుంటే గిరిజనులకు స్వయం సాధికారత కల  సాకారమౌతుంది.

                                                                                                   గుమ్మడిలక్ష్మీనారాయణ
                                                                                                           9491318409                                 
నోట్ (04.08.2౦2౦):--   ఈ వ్యాసాన్ని చిన్న చిన్న   సవరణలతో పంపించడం జరిగింది . దీనిని స్వీకరించగలరని మనవి .
                                                                                                                                    భవదీయులు,
                                                                                                                                  జిఎల్ ఎన్