//  హరిత హారం //

               " పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు"  నానుడి జీవవైవిధ్యానికి, మానవ ప్రగతికి దోహదపడే  సజీవ దృశ్యాలు చెట్లు. పర్యావరణ  సమతుల్యతను నిర్ధారించేవి హరితవనాలే. అడవుల వల్ల స్వచ్ఛమైన గాలి కాలానుగుణ వర్షాలు, నేల క్రమక్షయం తగ్గుదల, ఇంధన వనరులు,కలప లభ్యమౌతున్నాయి. అటవీ చట్టాలున్నప్పటికీ ఆటవిక నరికివేత అనేది పర్యావరణ శాపంగా మారింది. ప్రపంచీకరణ, సరళీకరణ లో భాగంగా అభివృద్ధి సాకుతో కొందరు స్వార్ధపరుల విలాసవంత జీవితం కోసం ప్రకృతి వనరుల విధ్వంసం పెరిగింది. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్న  చందంగా వ్యవహరిస్తున్న వారిపంధా మారకపోతే భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకమే. అందుకే పర్యావరణ సంరక్షణ చట్టాలకు అనుగుణంగా చెట్లపెంపకం, అడవుల విస్తరణ అనేది నేడు మానవాళికి విజ్ఞతతో కూడిన ప్రాధాన్యతాంశంగా  మారింది.
                దేశానికే తలమానికంగా ఉండేవిధంగా తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో పర్యావరణ పెంపు, అడవుల విస్తరణ కోసం 'హరితహారం' అనే బృహత్తర కార్యక్రమాన్ని 2015 నుండి కొనసాగిస్తున్నది. తెలంగాణాలో అటవి విస్తరణ 33 శాతానికి పెంచాలనే లక్ష్యంగా ఆరు విడతలుగా సాగిన హరితోద్యమం సత్పలితాలనిస్తోంది. గత ఆరేళ్లలో జనావాసాలలో, అడవి లోపల సుమారు 200 కోట్ల మొక్కలను నాటారు. ఈ ఫలితాలు సానుకూలం కావడంతో అందరిలోనూ పర్యావరణ స్పృహ మరింత పెరిగింది. ఈ హరిత  భావజాలం ప్రజాదరణ పొందడంతో పెక్కుమంది మేము సైతం అంటూ మొక్కల నాటడానికి ముందుకు సాగుతున్నారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని  మొక్కలకు అంకితం చేసి  జాతీయస్థాయి  పురస్కారం  అందుకునేదాక వెళ్లారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి వినూత్న కార్యక్రమాలకు ఎందరో వన ప్రేమికులు పూనుకోవడం  సంతోషదాయకం. కోవిడ్ - 19 నేపద్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న తరుణంలో ముఖ్యంగా ఔషధ మొక్కలను నాటుకోవడం వారసత్వంగా మారాలి. ఇప్పటికే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు పచ్చదనం, పరిశుభ్రతపై శ్రద్ధ పెడుతున్నాయి
                           స్వార్థ ప్రయోజనాల కొరకు దుండగులు అడవులు నరకడం వల్ల ప్రతి ఏటా భూమిపై 36 మిలియన్ల ఎకరాల అడవులు తరిగిపోతున్నాయి. వన్యజీవుల ఆవాసాలే కాదు  నేలకోత పెరగడం, హరితగృహ వాయువుల విడుదలై భౌగోళిక వెచ్చదనానికి(గ్లోబల్  వార్మింగ్) దారితీస్తాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యే హరితగృహ వాయువుల మొత్తంలో 15 శాతం అడవులు నరికివేత వల్ల విడుదలవుతోంది. రాజస్థాన్ లోని వైష్ణోయ్ తెగకు చెందిన అమృతాదేవి హరితోద్యమం మనకు ఆదర్శం కావాలి. అడవి నరికి కలప సేకరించి రాజభవనం కట్టుకోవాలన్న రాజు గారికి వ్యతిరేకంగా పోరాడి సఫలీకృతులయ్యారు. ప్రకృతిని కాపాడేందుకు 29 నియమాలతో స్వయం చట్టం చేసుకున్నారు. 'లేడీ టార్జాన్ ఆఫ్ ఝార్ఖండ్'  గా పేరుగాంచిన ఆదివాసి తెగ జమునతుడు పోరాడిన తీరుకు మెచ్చిన ప్రభుత్వం  2019 లో పద్మశ్రీ ప్రకటించింది. మన రాష్ట్రంలో చెంచులు, గోండ్ లు అడవుల్లో జీవిస్తూ అటవీ సంపదను కాపాడుకుంటున్న తీరు అభిలషణీయం.

  పచ్చదనం పెంపు, అడవుల రక్షణ పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ దేశవ్యాప్త కార్యక్రమాలకు? ఆదర్శంగా నిలిచింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2015 - 19 మధ్య ఒక లక్షా 85 వేల ఎకరాల్లో పచ్చదనం పెరిగింది. 18 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం 24 శాతం పెరిగింది. క్షీణించిన అడవుల పునరుద్ధరణ నిర్ధారించే కనోపిడెన్సిటీ పెరుగుదల ప్రకారం మెరుగైన ప్రగతి సాధించింది. ఈ ఏడాది మరో 920 అటవీ బ్లాకుల్లో 2లక్షల 10 లక్షల అటవీ పునద్ధరణ లక్ష్యంగా అటవీ శాఖ ప్రయత్నిస్తోంది. ఇది నాలుగేళ్ల పరిమితిలో పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు వేగవంతమైనాయి. హైదరాబాదులో అర్బన్ ఫారెస్ట్ పేరుతో తక్కువ విస్తీర్ణంలో అటవి జాతుల మొక్కలతో చిట్టటడవులను పెంచుతున్నారు. హైదరాబాద్ నగరంతోపాటు పట్టణాల్లోనూ ప్రజలను కాలుష్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి రక్షించి ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే 'అర్బన్ లంగ్స్ స్పెస్' లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. కరోనా ప్రభావంతో హరితహారంలో ప్రజల భాగస్వామ్యం తగ్గడంతో ఆకాశమార్గాన హరిత సందడి అన్నట్లు విత్తన బంతులను(సీడ్ బాల్స్) డ్రోన్ల సహాయంతో చల్లిస్తున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో తయారుచేస్తున్న విత్తనబంతులు తొమ్మిది రోజుల్లోనే 1.12 కోట్లు తయారు చేసి మర్రి, రావి, మేడి, వేప,చింత,జువ్వి తదితర విత్తనాలను డ్రోన్లతో ఇటీవల పాలమూరు అడవుల్లో చల్లించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పరిశీలనలో ఉండటం అక్కడి ప్రగతికి సూచన.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు మానవ మనుగడకు పెనుసవాళ్లు విసురుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా మెలుగుతూ ఆచరణాత్మకంగా భూతాపాన్ని  తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రకృతి వనరులను విరివిగా వాడటం వల్ల కరోనా వంటి ఉపద్రవాలు ఏర్పడిన సందర్భంలోనైనా పరిమితి పాటించటం అలవాటు కావాలి. భవిష్యత్ తరాలకు అటవీవనరులు అందచేయాలంటే సుస్థిర అటవీ విధానాలు అవసరం. ప్రతి విడతలో నాటిన మొక్కల సంరక్షణలో చిత్తశుద్ధి ప్రదర్శించాలి. హరితహారం లాంటి పర్యావరణ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తే మనదేశం సుభిక్ష హరిత దేశంగా విలసిల్లగలదు.

గుమ్మడి లక్ష్మీనారాయణ

9491318409