భాషా వికాసం కొరవడిన సి'త్రాలు
డా. కస్తూరి రంగన్ కమిటీ జాతీయ విద్యావిధానం ప్రకారం మాతృభాష బోధన తెరమీదకు రావడంతో తెలుగుభాషపై పట్టు ఏర్పడనుంది. ఈ ముసాయిదా ప్రాథమిక స్థాయి బోధన మాతృభాషకే మొగ్గుచూపడం శుభపరిణామం. అతిధులను ఆహ్వానించే సంప్రదాయ ముగ్గులాగా; ఇంటిల్లిపాదికీ వినోదాన్ని పంచుతూ , కష్టసుఖాలను కలబోసుకునేది సినిమా. కాగా ముగ్గులు కనుమరుగవుతున్నట్టే తెనుగు సినిమా నుండి ఉట్టిపడే తెలుగుదనం కూడా తెరమరుగవుతోంది. కథలో, పాత్రల్లో, కథనంలో, పాటల్లో తెలుగుదనం పెత్తనాన్ని ప్రశ్నిస్తూ అన్యభాషలు పరకాయ ప్రవేశం మొదలైంది. ఇక సినిమాకు ఆకర్షణగా నిలిచే శీర్షికల నుండి సంభాషణల వరకు అంతటా పరభాషా పదాలు వీరవిహారం చేస్తున్నాయి. ఇది దశాబ్దన్నర కాలం నుండి మరింతగా పెరిగింది. దీనివల్ల భాషా వికాసం కొరవడుతోందని తెలుగు బాషా పండితుల ఆవేదన. ఏటా విడుదలయ్యే చిత్రాల్లోని 60 శాతం శీర్షికల పేర్లు తెలుగేతరమైనవే. కాని మన పొరుగునున్న తమిళనాడులో సినిమా పేర్లన్నీ తమిళంలో గోచరించటం విశేషం .
పూర్వ సాంప్రదాయాలు, ఆధునికత, నవ జీవనశైలి జనంలోకెళ్లాలన్నా, వాటికి సామాజిక హోదా రావాలన్నా సినిమాలే తొలి సాధనాలు. సినిమా పేర్లలో, ప్రకటనల్లో తెలుగేతర పదాల చొరబాటు అనేది వెనుకటి నుంచి ఉన్నదే. 1206 నుండి 1757 వరకు ఇస్లాం పాలకుల వల్ల అరబ్, ఉర్దూ, పర్షియన్ పదాలు భారతీయ భాషల్లో విస్తృతంగా కలిశాయి. అలాగే 1857 - 1947 దాకా బ్రిటిష్ పరిపాలనలో ఆంగ్ల పదాలు మాతృభాషల్లోకి ప్రవేశించాయి. భాషా పరిణామ క్రమంలో ఈ తరహా "ఆదాన ప్రదానాలు" సహజమే ఐనప్పటికీ తెలుగు కుదించబడటమే ఆందోళనకరం. సినిమా పేర్లను మొదట ప్రభావితం చేసింది సంస్కృతమనే చెప్పడానికి - తొలి తెలుగు చిత్రం 'భక్త ప్రహ్లాద' (1931). తెలుగు భాషాశాస్త్ర నియమాల ప్రకారం అది 'భక్త ప్రహ్లాదుడు'. గత పౌరాణిక, సాంస్కృతిక, చారిత్రక, సామాజిక, కుటుంబ కథాచిత్రాలన్నీ సంస్కృతం నుండే పుట్టాయి. 1990 తర్వాత తెలుగు సుశీర్షికలతో కుటుంబ కథా చిత్రాలెన్నో విజయం సాధించాయి. సినిమా పేర్లలో ఉర్దూ, పార్సీ భాషల మిశ్రమ పదాలతో జైత్రయాత్ర పరంపరలో ఒకప్పటి తాసిల్ధార్ (1944), మాయాబజార్ వంటివి తెనుగీకరణ ఉదాంతాలే. 1991 తర్వాత మొదలైన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల ఫలితంగా యువతలో ఆంగ్లవాడకం పెరగడంతో నిర్మాతలు టైటిళ్లలో ఆంగ్లం వాడినారు. ఇది తొలుత తెలుగు-ఇంగ్లీషు మిశ్రమ పదాలతో ఆరంభమైందనడానికి దృష్టాంతం - మిస్సమ్మ' (1955), జానకి వెడ్స్ శ్రీరామ్, మిస్టర్ పెళ్ళికొడుకు. 21వ శతాబ్దం నుంచి విడుదలవుతున్న సినిమా పేర్లలో 30 శాతం ఆంగ్లమే. బిజినెస్ మేన్, హ్యాపీడేస్, మిస్టర్ ఫర్ఫెక్ట్...వంటి పేర్లకు తెలుగుకు ఉన్న సంబంధమేమిటి? 2011 నంది పురస్కారం పొందిన ఉత్తమ కుటుంబ కథాచిత్రం'100%లవ్' ,2014 లో లెజెండ్, 2016 లో జనతా గ్యారేజ్ 'లు ఆంగ్ల ఆకర్షితమే! ఆంగ్ల వ్యామోహం పేర్లకే పరిమితం కాక కథ, సంభాషణలలోకి జొర్రింది. ఇక ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, మురారి, ఒకే ఒక్కడు, పోకిరి....వంటి అచ్చమైన తెలుగు శీర్షికల్లో ఏం లోపించిందో గానీ - ఇడియట్, రాస్కెల్, రెబల్ ...శీర్షికలు ఊడి పడ్డాయి. నేడు యువతరం చిత్రాల పోటీ పెరగడంతో ఆంగ్లం సరసన హిందీ స్వైర విహారం షరా మామూలే. ఖతర్నాక్,తీన్ మార్ మచ్చుకు కొన్ని.
వందేళ్ల సినీ చరిత్రలో తెలుగువారి జీవన సంస్కృతికి అద్దం పట్టే సామెతలు, సూక్తులను శీర్షికలుగా పెట్టిన సందర్భాలున్నాయి. చెరపకురా చెడేవు; అప్పుచేసి పప్పుకూడు; కలిసి ఉంటే కలదు సుఖం; డబ్బుకు లోకం దాసోహం వంటి తెలుగు నుడికారం ఉట్టిపడే పేర్లు క్రమంగా అంతరిస్తున్నాయి. 21వ శతాబ్ధపు - క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శతమానం భవతి వంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయి. చిత్రాల్లో రీమేక్ , పాటల్లో రీమిక్స్ పెరగడంతో అర్థవంతమైన టైటిల్స్ అదృశ్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక అనువాద చిత్రాలు ప్రాంతీయ భాషలలో, మాతృభాష శీర్షికన విడుదలైనప్పటికీ 'రోబో' మాత్రం మరమనిషి గా తెరకెక్కలేక పోయింది. ఇలా సినిమాల్లో తెలుగుదనమే కాదు తెలుగోల్ల జీవితమే అదృశ్యం కాబోతుంది. శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా సినిమా అనేది ప్రేక్షకులపై చూపిన ప్రభావం కాదనలేనిది. దురదృష్టవశాత్తు నేటి చిత్రాలు మాతృభాషను మరచిపోవడానికి సోపానాలు అవుతున్నాయి. మాతృభాష పరిరక్షణలో మనం తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. సినిమా పేర్లలో తమిళేతర పదాలుంటే అక్కడ ప్రభుత్వం తమిళ సినిమాపన్నులు విధిస్తోంది. వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో, కథనంతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ సినిమాలు తెలుగు సహా ఇతర భాషలలో పునర్నిర్మాణమై విజయాలు సాధిస్తున్నాయి. తమిళ సినిమా ఫార్ములాను మన చిత్రపరిశ్రమ స్వాగతించాలి.
కొంగొత్త శీర్షికల ఒరవడితో ' శ్రీకారం 'చుడుతూ ఆ స్ఫురణలో - అర్థవంతమైన, ఆకర్షణీయమైన శీర్షికలతో సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు. గతంలో కాట్రగడ్డ మురారి, దాసరి నారాయణరావు , అక్కినేని నాగేశ్వరరావు వంటి సీనియర్ దర్శక నిర్మాతలు అచ్చమైన తెలుగు పేర్లతో సామాజిక, కుటుంబకథా చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. తెలుగు వారి సంక్రాంతి ముగ్గుతోనే ఆరంభమైనట్లు మన సినిమాలు అచ్చ తెలుగు శీర్షికలతో తారసపడితే అదే నిజమైన 'సంక్రాంతి'. టాలీవుడ్ లోనూ పూర్తి తెలుగు అమలు చేసేలా ప్రభుత్వం చట్టం చేయాలి. తెలుగు అమలు పరిచిన చిత్రాలకు ప్రొత్సాహక రాయితీలు ఇవ్వాలి. సినిమాల్లో ఆటకు ముందు భారతీయ సాంస్కృతిక, సామాజిక పరమైన వర్తమానాంశాలపై డాక్యుమెంటరీలు ప్రదర్శించేలా చర్యలను తీసుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటిలాగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతలే లక్ష్యంగా చిత్రాలకు పదహారణాల తెలుగుదనం ఉట్టిపడే తెలుగు శీర్షికోప శీర్షికలతో తెరంగేట్రం జరగాలి. మాతృభాష అమలు జరగడం తొలుత టాలీవుడ్ ద్వారా నెరవేరితే గనక ప్రభుత్వ పరిపాలన తెలుగులో కొనసాగడానికి సుగమం అవుతుందేమో!
//మాతృభాష పరిరక్షణలో మనం తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. సినిమా పేర్లలో తమిళేతర పదాలుంటే అక్కడ ప్రభుత్వం తమిళ చిత్రపరిశ్రమ పన్నులు విధిస్తోంది. వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో, కథనంతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ సినిమాలు తెలుగు సహా ఇతర భాషలలో పునర్నిర్మాణమై విజయాలు సాధిస్తున్నాయి. తమిళ సినిమా ఫార్ములాను మన చిత్రపరిశ్రమ స్వాగతించాలి. //
గుమ్మడి లక్ష్మీ నారాయణ
9491318409
0 Comments