మానవాళి అజాత శత్రువు
వయ్యారిభామ ఒక కలుపు మొక్క అని తెలిసినా దానిని జీవజాతికే భీకర శత్రువుగా పరిగణించలేకపోతున్నారా! అనే సంశయం కలుగకమానదు. ఇది మామూలు గడ్డి మొక్కే కదా అని వదిలేసినందుకే కొన్ని కోట్ల రూపాయలు ఆదాయాన్నిచ్చే పంటలను నిలువెల్లా మింగేస్తున్న వైనం తేటతెల్లమైంది . పర్యవసానంగా ఇది కలిగిస్తున్న దుష్ప్రభావం మానవాళికి , పాడి పశువులకు అత్యంత ప్రమాదకరంగా ఉంటోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు . ఇన్నేళ్లు ఈ కలుపు మొక్కలను నివారించకుండా నిర్లక్ష్యం చేసినందుకు మూల్యంగా రూ. 662 కోట్లు వెచ్చించాలని 2011, అక్టోబర్ 5 న ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ సంచాలకులు శ్రీమతి ఉషారాణి కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపించారు . ఒక జాతి కలుపు మొక్క నివారణకే ఇంత మూల్యం చెల్లించడం... ఆశ్చర్యం కలగవచ్చేమో గాని అంతిమ లక్ష్యం నివారణే ప్రధానం. కరోనా వంటి ప్రమాదకర వైరస్ విజృంభణలో ... రైతులు ముందస్తుగా మేల్కొని పంటల దిగుబడి తగ్గకుండా వయ్యారిభామ కలుపును నిర్మూలించడం బాధ్యతగా భావించాలి! ఇటీవల మనదేశంలో ఉహించని నష్టం కల్గిస్తుందనుకున్న మిడతల దండు ప్రబావం కంటే వయ్యారిభామ కలిగించే నష్టమే అధికంగా ఉంటుందని భావించాలి.
వృక్షశాస్త్ర పరంగా ఆస్టరేసి కుటుంబానికి చెందిన పార్థీనియం హిస్టిరోఫోరస్ దీని శాస్త్రీయ నామం. ఇది తరచుగా బీడు భూములు, శిధిల నిర్మాణాల్లో, పంట చేలల్లో, ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాల్లో తెల్లటి పూలతో విరివిగా మొలిచే విదేశీ మొక్క. 1950లో అమెరికా నుండి నౌకల ద్వారా గోధుమలు దిగుబడి చేసుకునే క్రమంలో మన దేశంలోకి విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల హెక్టార్ల భూముల్లో పార్థీనియం మొక్కలు విస్తరించి ఉన్నట్లు 2011లోనే వ్యవసాయాధికారులు నిర్ధారించారు. సేద్యపు భూముల తో పాటు ఖాళీ స్థలాలను వదలకుండా రాష్ట్ర విస్తీర్ణంలో నాలుగో వంతు దాకా ఆక్రమించాయి. వీటి వల్ల పంటల దిగుబడి క్షీణించి , రైతుల ఆదాయాన్ని కుంగదీయడమే గాక మానవాళికి , పాడి పశువుల ఆరోగ్యంపై a2 పెను దుష్ప్రభావం కలిగిస్తోంది. దీన్ని సమూలంగా నిర్మూలించకపోతే భవిష్యత్తులో రైతులకు పెను సవాల్ గా మారనుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. దీని తక్షణ నిర్మూలనకు 662 కోట్ల రూపాయలు వెచ్చించి మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎం ఆర్ ఈ జి ఎస్) కింద చేపడితే వ్యవసాయ కూలీలకు 6.62 కోట్ల పని దినాలు కల్పించే భాగ్యం కలుగుతుందనే వ్యవసాయ తాఖ ప్రతిపాదనలు కేంద్రానికి చేరి తొమ్మిదేండ్లు గడిచింది. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు.
వ్యాప్తి - నష్టాలు :-- తొలకరి వర్షం మొదలుకొని సెప్టెంబర్ దాకా విరివిగా కనిపించే మొక్కలు గాలిలో పుప్పొడి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒక్కొక్క మొక్క 500 థాకా విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంటుంది. వీటి వల్ల పెట్టుబడిలో 40 శాతం, పశుగ్రాసంలో 80 శాతం దిగుబడి క్షీణిస్తుంది. వీటి పుప్పొడి రేణువులు టమాటా, వంగ,మిరప జాతి మొక్కలపై వాలిపోయి పుష్పాలు, పిందెలు రాకుండా అడ్డుకుంటాయి. ఇతర వైరస్ తెగుళ్ళను వ్యాపింపజేస్తాయి. మృత్తికలో నవుజని స్థిరీకరణకు అడ్డుకోవటంతో రైతులు యూరియాను అధికంగా వాడాల్సి వస్తోంది. రసాయన ఎరువుల వాడకానికి సాగు వ్యయం పెరగడానికి ఈ మొక్కలే కారణమన్న సత్యాన్ని పసిగట్టలేకపోతున్నారు రైతులు. అంతేగాక ఇవి తెగుళ్ళకు వాహకాలు (వెక్టార్స్ )గా ఉంటూ పంట దిగుబడిని తగ్గించే వ్యాధి కారకాలు. ముఖ్యంగా పాడి పశువులు ఆ మొక్కలను తింటే పాల దిగు బడి తగ్గే అవకాశం మెండుగా ఉంది. పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులకు ఇవి వెదజల్లే పుప్పొడి వల్ల ఉబ్బసం , కళ్ళ మంటలు , చర్మ వ్యాధులు, విషజ్వరాలు సంభవిస్తున్నాయి. 2017 నుంచి వ్యవసాయాధికారులు వయ్యారిభామ నిర్ములన వారోత్సవాల సందర్బంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోగా రైతుల్లో నిర్లక్ష్యం జాడ్యమేలుతోంది. ఈ ముప్పును తప్పుకోవాలంటే ఒకింత అవగాహనతో లేత మొక్క దశలోనే నివారించుకోవడం మేలు.
నివారణ పద్ధతులు :-- కరోనా కల్లోలంలో ఉపాధి పనులు కోతపడ్డా ... కార్మికులంతా వ్యవసాయ పనిలో నిమగ్నమైన సందర్భంలో వయ్యారిభామ దుష్ప్రభావాన్ని రౌండప్ లాంటి కలుపు నివారణ మందులతో స్ప్రే చేయడంతో పాటు కొన్ని ముందు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఈ మెక్కలను వేళ్ళతో సహా పీకి కాల్చివేయడం వరుసగా రెండేళ్ల పాటు కొనసాగాలి. చేతికి తొడుగులు ధరించడం తప్పనిసరి. జైగో గ్రామాబైకొలరెటా అనే క్రైసోమిలిడ్ జాతి పెంకు పురుగులను వదలి జీవ నియంత్రణ ద్వారా నివారించవచ్చు. ఈ పురుగులు వాటి ఆకులు తిని వేస్తాయి . పంట మార్పిడి పద్దతిలో బంతి సాగు చేస్తే తర్వాత పంటలో కలుపు మొక్కల అంకుర దశను అడ్డుకుంటాయి. 15 నుంచి 20 శాతం ఉప్పు ద్రావణంతో పిచికారీ చేయవచ్చు. ఈ మొక్కల నివారణకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అనివార్యం. స్వచ్ఛంద సంస్థలు, ఉపాథి హామీ కూలీలను వీటి నిర్మూలనలో భాగస్వాములను చేస్తే ఫలితముంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న హరితహారం లాంటి విప్లవాత్మక మైన కార్యక్రమాల ద్వారా వయ్యారిభామ మొక్కలు నిర్మూలించే ప్రయత్నం ప్రభుత్వం పూనుకుంటే అందరికీ క్షేమదాయకం.
జి ఎల్ ఎన్
9491318409
0 Comments