"గోళ్ళ కత్తిరింపు వైరస్ నిరోధకమే!"
*****పూర్వం పెద్దలు చెప్పినట్లు 'ఆరోగ్యమే మహాభాగ్యం' ఇప్పుడు అతి ప్రాధాన్య మైనది. అందరూ వ్యక్తిగత శుభ్రత పై దృష్టి పెడుతున్నారు. అందులో గోళ్ళ శుభ్రత అనేది దాదాపుగా గుర్తెరగని విషయం. కొందరికీ చిన్నప్పటినుంచి చేతిగోళ్లు పెంచుకోవడం అనే అలవాటు పరిపాటిగా మారింది. మన మీద మనకున్న అతి నమ్మకమో ! ఏమో గాని ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు .ఎవరికి వారు గోళ్లను శుభ్రం చేసుకుంటున్నామని అతినమ్మకం ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఆరోగ్య లక్షణం కాదు. ఎందుకంటే కొన్ని సమయాల్లో గోళ్ళలో మట్టి చేరడం వల్ల గోళ్లు అనేవి వందలాది క్రిములకు ఆవాసంగా మారుతున్నాయి. చేతుల అందానికి ప్రధాన ఆకర్షణగా గోళ్లను పెంచుకుంటున్నారు. వాటికి సంప్రదాయంగా గోరింటాకు పెట్టే బదులు వివిధ రంగులు వేసి మురిసిపోతుంటారు. వీటికి తోడు కొత్తగా 'నెయిల్ఆర్ట్' అంటూ కొత్త ఫ్యాషన్ కు అలవాటు పడుతున్నారు.
***** గోళ్లను పెంచుకోవడం చూడ్డానికి అందంగానే ఉన్నా ఆరోగ్యానికి అంత మంచిది కాదు .ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోళ్లు అస్సలు పెంచుకోకూడదు అని పరిశోధకులు చెబుతున్నారు .తాజా నివేదికల ప్రకారం కరోనా వ్యాప్తికి పొడవైన గోళ్ళు కూడా కారణం అంటున్నారు డాక్టర్లు. చేతులను శుభ్రం చేసుకున్నా వ్యాధికారక వైరస్ లు , బ్యాక్టీరియాలు గోళ్లలోనే ఉండిపోతాయంటున్నారు . పొడవాటి గోళ్లలో వైరస్ స్థిరంగా ఉంటుంది. ఈ కారణంగా మనం తీసుకునే ఆహారంలో ఆ వైరస్ లు చేతి గోళ్ల ద్వారా పొట్టలోకి చేరతాయి. దీని ద్వారా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
***** జీవ శాస్త్రీయంగా గోళ్లు అనేవి మనిషికి అవశేష అవయవాలు . వీటికి ప్రత్యేక విధి అంటూ ఏదీ లేదు .శరీరానికి నిరుపయోగమైన వీటిని అందం గా భావిస్తూ అనారోగ్యాన్ని తెచ్చుకోవడం మంచిది కాదు. చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. అతి కొద్దిమందికి వేళ్ళను నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలాంటి సమయంలో నోటి ద్వారా వైరస్ లోపలికి వెళుతుంది. అంతే కాకుండా పిల్లలు ఆరుబయట ఆటలాడుతున్నప్పుడు మరియు పెద్దవారు పనులు చేస్తున్నప్పుడు మట్టి చేరడం మూలాన ఒక్కోసారి టేటానస్ క్రిములు గోళ్ల లోకి చేరిపోతాయి.అలాగే గాయాలైన సందర్భంలోనూ
ఈ క్రిములు శరీరంలోకి చేరతాయ్. అందువల్ల ధనుర్వాతం ( టేటానస్ ) సోకుతుంది.ఇంకా గోళ్ళ మాలిన్యం వల్ల అమీబియాసిస్(అమీబిక్ డీసెంట్రీ ) మరియు ఆస్కారియాసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది .వీటన్నిటిని నిర్మూలించాలంటే కచ్చితంగా గోళ్లను ఎప్పటికప్పుడు చిన్నవిగా కత్తిరించుకొంటే క్రిముల బారి నుంచి రక్షించుకోగలుగుతాము.
#గుమ్మడి లక్శ్మి నారాయణ,
సెల్:9491318409
0 Comments