ఆగస్టు 29 : తెలుగు బాషా దినోత్సవం(గిడుగు జయంతి) సందర్బంగా ....
" సవరజాతి అక్షరం గిడుగు "
తల్లి జన్మనిస్తే భాష వికాసాన్నిస్తుంది. అదే మాతృభాష అనుబంధం. ఈ యేటి జాతీయ విద్యావిధానం వల్ల ప్రాథమికస్థాయిలో తెలుగుకు విశిష్ట స్థానం ఏర్పడబోతుండగా దాని అమలుపై ప్రభుత్వం ప్రతిన బూనాల్సిందే. 2006 లో తెలుగుకు ప్రాచీన హోదా ఏర్పడిన నుండి భాగ్యనగరంలో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభల సందర్బంలో " తెలుగు సాంస్కృతిక వికాస సంవత్సరం -2013"తదుపరి అమలు అధమంలో ఉంది. సవర గిరిజనుల భాషపై పరిశోధనలో భాగంగా సవరలిపిలో నిఘంటువును రూపొందించి మరోపక్క తెలుగు వాడుక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు తెలుగువారి గుండెల్లో సుస్థిర ముద్ర. తెలుగు భాషలో వ్యహహారిక భాషావ్యాప్తికి నిరంతర కృషి సల్పిన గిడుగు గ్రాంధిక భాషావాదుల పాలిట 'పిడుగు' అని కీర్తించబడిన ఘనాపాటి మన గిడుగు వెంకట రామమూర్తి పంతులు. సవరలపై చేసిన అవిరళ కృషి గిడుగు వాడుకభాషా ప్రస్థానానికి నాంది.
శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో గిడుగు వెంకటమ్మ , వీర్రాజు దంపతులకు (1863) ఆగస్టు 29 న జన్మించిన గిడుగు జయంతి రోజును "తెలుగు బాషా దినోత్సవం"గా జరుపుకుంటున్నాం. గిడుగు సహాధ్యాయి గురజాడతో కలిసి విజయనగరం మహారాజా కళాశాలలో బీ.ఏ. పట్టా పుచ్చుకొని చరిత్ర అధ్యాపకులుగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి పట్టణానికి చేరువ కొండలపై నివాసముండే అమాయక సవరజాతి గిరిజనులపై దృష్టి పడింది. నాగరికులతో పోల్చితే నీతి నిజాయితీ గల మానవీయులు. కడు దైన్యస్థితిలోనూ ప్రత్యేక జీవన సంస్కృతి విస్మరించని ఆదిమ ప్రపంచం సవరలది. గిడుగు సవరలపై దృష్టి పెట్టడం చాటున వారి వెనుకబాటు తనమే కాదు చారిత్రక నేపధ్యం దాగుంది. 2500 ఏళ్ళనాటి సింధూ నాగరికత వెల్లివిరియడానికి ముందే ప్రత్యేక నాగరిక సంస్కృతి వారిది. భారత ఇతిహాసాలలో సవరల ప్రస్తావన ఉంది. అందుకు నిలువెత్తు ఉదాహరణ రామాయణంలో శ్రీరాముని ఉదాత్త సేవకురాలు శబరి సవరీయురాలు. సవరల అభివృద్ధి కాంక్షించిన గిడుగు వారిని తొలుత చదువుబాట పట్టించాలని సంకల్పించారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో సవరల జనాభా 1,22,979 మంది. సగటు అక్షరాస్యత 14.38 శాతం. ప్రపంచీకరణలో వీరి సాంసృతిక జీవనం చతికిల పడటంతో తెగ ప్రమాదంలో ఉంది. సవరలు ప్రకృతి ఆరాధకులు. వీరి చిత్రకళ - ఈడీసింగ్ ప్రకారం ప్రకృతి చిత్రాలనే గీస్తారు. ప్రత్యేకులైన వీరి సవరభాషను గిడుగు నేర్చుకొని పిల్లలకు వారి మాతృభాషలోనే విద్య నేర్పడానికి ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు. గిడుగు రచించిన సవర వాచకాలు, కథల పుస్తకాలు, పాటల పుస్తకాలు,తెలుగు - సవర, సవర - తెలుగు నిఘంటువులను 1911లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ప్రచురించింది. ఆయన కృషికి ప్రభుత్వం పారితోషికం ఇవ్వజూపితే అందుకు గిడుగు " ఆ డబ్బుతో ఒక బడి నెలకొల్పండి. నేను పెట్టిన బడులకు నిధులివ్వండి! " అని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే శిక్షణా పాఠశాలలను స్థాపించింది. వివిధ సవర రచనలు, సవర బాషావ్యాకరణ నిర్మాణంలో గిడుగు సాధించిన కృషికి ప్రభుత్వం 1913 లో 'రావూ సాహెబ్' బిరుదును బహూకరించింది.
పాఠ్యపుస్తకాల్లో, సామాన్య ప్రజల్లోనూ వ్యావహారిక భాషను వ్యాప్తి చేయడంలో ఆయనకు సాటిలేరు. సవర బాషలో ' ఏ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజెస్ ' (1930 ) వ్యాకరణంను రచించారు. సవర గిరిజనుల సంబంధ అంశాలను చేర్చిన ' క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా ' ను రచించిన నృశాస్త్రవేత్త థరస్టన్ తో గిడుగు చర్చించారు. హవాయి విశ్వవిద్యాలయం (అమెరికా) పాశ్చాత్త బాషావేత్త స్టాన్లీస్టరోస్టా తన పి.హెచ్.డి గ్రంధాన్ని సవరలిపి పరిశోధకుడైన గిడుగుకు అంకితమివ్వడం విశేషం. గిడుగు పరిశోధనలకు, బాషా కృషికి మెచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం 1933 లో ' కైజర్ - ఇ - హింద్ ' బిరుదుతో పాటు బంగారు పథకాన్ని ప్రకటించింది. మద్రాసు గవర్నరు స్వయంగా ఛత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బారులో గిడుగును సత్కరించారు. తరాలు మారేకొద్దీ సంప్రదాయ భాష , సంస్కృతులపై ప్రపంచీకరణ సంక్షోభం పరిమితమైన నిమ్నవర్గ సమాజాలపై పెనుప్రభావం చూపుతోంది. సంప్రదాయ చదువులు, స్వంతలిపి, సామాజిక అభివృద్ది వంటివి సన్నగిల్లిన తరుణంలో ఆదిమభాషల క్షీణత శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి తీసుకుంటున్న ఆదిమ భాషల పరిరక్షణ చర్యల్లో భాగంగా గిరిజనులకు బీజాక్షరాలను ప్రసాదించిన సవరలిపి నిర్మాత గిడుగు మార్గదర్శకత్వంలోనైనా మాతృ భాషల్ని పరిరక్షించాల్సిన భాద్యత ప్రభుత్వ వర్గాలపై ఉంది. తెలుగు విభాగం పాఠశాలలను రక్షిస్తూ, కళాశాలల్లో ఐచ్చికంగా తెలుగును తప్పనిసరి చేస్తూ, ప్రత్యేకంగా తెలుగు గ్రంధాలయాలు స్థాపించాలి.
లక్ష్మీనారాయణ గుమ్మడి 9491318409
ఆదివాసి రచయితల వేదిక
0 Comments