అక్షరతూణీరం !
(జూలై 28: 'ఎవరిదీ అడవి?' రచయిత్రి మహాశ్వేతాదేవి నాలుగో వర్ధంతి)
"అడవిని చూడండి . జలజల పారే సెలయేళ్లు, మెరిసే ఎండ, చెంగు చెంగున గంతేసే కృష్ణ జింకలను చూడండి. సెలయేళ్ల దగ్గర, వాగులు వంకల, చెలిమల దగ్గర పల్లెతల్లులు పిల్లల్ని చంకనేసుకుని కుండలలో నీరు నింపుట, సూర్యుడు వంగి భూమిని చూస్తుండటం వంటి దృశ్యాలు ఇంపుగా ఉంటాయి. రైతులు పొలాలు దున్నుతున్నప్పుడు అడవులే కాదు, కొండలు, గుట్టలు కూడా పచ్చదనంతో నవనవలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమీ జరగదు! ఏమీ కాదు !!.నువ్వు కలగననంతవరకు, కలగనడం ఎలాగో నీకు తెలియనంత వరకు అక్కడ ఏమి జరగదు - అయితే రాజకీయ, పరిపాలన వ్యవస్థలు రిమోట్ కంట్రోల్ తో నీతో కలలు కనిపించే నీ మెదడు జీవకణాల్ని నాశనం చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కలలు తప్పించుకుని బయట పడతాయి. అట్లా తప్పించుకుని బయట పడ్డ కలల వెంట నేనెప్పుడూ పరుగెడుతుంటాను. ఈ మానవాళి సజీవంగా కొనసాగాలంటే కలలు గనే హక్కు తప్పకుండా ఉండాలి. కానీ.... పరిపాలన వ్యవస్థ - కలలుగనే హక్కునే కూలగొడుతుంటే ఏమవుతుంది ? వ్యక్తులు కూలీ పోతారు. మొత్తంగా ప్రపంచమే కూలిపోతుంది. కలల కనడ మన్నది మనందరి ప్రాథమిక హక్కు. దీన్ని మనం కాపాడుకోవాలి!
బహుశా1980 నుండి నేను నా పోరాటాన్ని- ఉధృతం చేశాను. గొంతు విప్పాను. ఆదివాసులు, గిరిజనులు, భూములేని గ్రామీణ పేద ప్రజలు, కూలీలు, నగరాల్లో పూట్ పాత్ జీవులు ఇట్లా వారి పక్షాన సమస్యలపై నా దినచర్యగా ప్రతిస్పందించాను. భారత దేశంలో స్వాతంత్రం ఎన్ని తప్పిదాలతో, ఎన్ని తప్పు నడకలతో ముందుకు వచ్చిందో విప్పి చెప్పగలిగాను. దేశంలో ప్రతి భాషలో ఇంకా పుస్తకాలు రాయబడాలి. ముద్రించబడాలి. అణగారిన ప్రజల జీవిత కథలు ప్రవహించాలి. ప్రతి ఒక్కరి చేతి వేళ్ళు అక్షరాల కోసం అంగలార్చాలి. మూగబోయిన గొంతు విప్పాలి. గతంలో నైనా, ఇప్పుడైనా, భవిష్వత్తులో నైనా మనమంతా కలలు గనేది మానవీయ విలువల కోసమే" అంటూ అక్టోబర్21,2006న మహాశ్వేతాదేవి జర్మనీ- ఫ్రాంక్ ఫర్డ్ బుక్ ప్రారంభోత్సవంలో మహాశ్వేత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతిమంగా - "కలలకు స్వాతంత్ర్యం కావాలి. తమ లాంటి రచయితల కలాలకు స్వేఛ్ఛ కావాలి "అని నిరంతరం తన ప్రసంగంలో చెప్తుండేవారు మహాశ్వేత.
మహాశ్వేతా దేవి రచనలు 90 శాతం గిరిజనులు జీవిత సంక్షోభాన్ని ఆవిష్కరించేవే. 1979 లో సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ఆమె చారిత్రక కాల్పనిక రచన "అరణ్వేర్ అధి కార్ "(ఎవరిదీ అడవి?) 19 వ శతాబ్దంలో బ్రిటీష్ పాలనపై జరిగిన ఆదివాసీ ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గిరిజన నేత బిర్సాముండా జీవితానికి, పోరాటానికి రమణీయంగా ఉంటుంది. "ఎవరిదీ అడవి" 1899 -1900 లో చోటా నాగపూర్, రాంచీ ప్రాంతంలో జరిగిన గిరిజనోద్యమం(ఉల్గులాన్) ఆధారంగా రాసిన నవల . గిరిజనోద్యమమో, మరో ఘటనో జరిగిన ప్రదేశానికి వెళ్లకుండా రచనలు చేసిన వారిలా కాకుండా, అక్కడికి వెళ్లి, ఆ మట్టితో మాట్లాడి, ఆ గాలిలో తిరగాడిన మహాశ్వేతకు తెలిసిన అద్భుతమైన విద్య. భారతీయ గిరిజనోద్యమాల ఆత్మ ఘోష మొత్తం 'ఎవరిదీ అడవి 'నవల చదివితే అవగతమవుతుంది.
మహాశ్వేత ఒక్కొక్క కథ గిరిజన జీవితంలోని ఒక విషాద పరిణామాన్ని వివరిస్తుంది . శనిచరి కథలో వ్యభిచార కూపాలలోకి బలవంతంగా కూరుకు పోతున్న వంగ ప్రాంత అటవీ బాలిక విషాద కథ. ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకు వెళ్ళి ఆ బాలికల చేత వ్యభిచారం చేయిస్తూ ఉంటారు దళారులు. అది భరించ లేని ఎంతో మంది ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. శనిచరి మాత్రం కడుపున పుట్టిన బిడ్డతో సహా తిరిగి గ్రామంలోకి వచ్చి తనతప్పు అపరాధం చెల్లిస్తుంది. ఐనా గిరిజన సమాజం ఆదరించదు. రైలు పట్టాల మీద బొగ్గు ముక్కలను ఏరుకుంటూ బతుకీడుస్తున్న దైన్యం .ఆ బొగ్గు ముక్కలే - నిప్పు రవ్వల్లాంటి ప్రశ్నలను సంధిస్తాయి. 'జీవిత ఖైదీ' కథలో 'మకర సవర' వర్తమాన చరిత్రలోని ఒక ఘోరంతో అల్లకల్లోలమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. ఇది సవర తెగలో పుట్టిన మకర అనే గిరిజనుడి వైవాహిక సంఘర్షణ. పెళ్ళయిన చాలా కాలానికి కూడా అతని భార్యకు గర్భం కాకపోవడంతో ఆమే స్వయంగా విడాకులుకోరుకుంటుంది. నిస్పంతువుగా ఉండలం ఆ తెగలో నిషిద్దం . గ్రామ పెద్దలకు హఠాత్తుగా తెలుస్తుంది అసలు సంగతి . అతనికి పిల్లలు పుట్టకుండా , రహస్యంగా శస్త్రచికిత్స చేశారని! గిరిజన సాంప్రదాయాన్ని 1975 నాటి అత్యవసర పరిస్థితులలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో ఎలా సంక్షుభితం చేశాయో వర్ణించే కధ ఇది.
1997లో విశాఖ పట్నం వచ్చిన మహాశ్వేత విశాఖ మన్యంలో గొప్ప మన్యసీమ ఉద్యమం నడిపిన అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా ఆయన శతజయంతి (1997) సందర్భంలో నవల రాస్తానని చెప్పారు. అలాగే విజయ నగరం జిల్లా పాచిపెంట మండలం 'మూల వలస' గూడాన్ని సందర్శించి అల్లూరి సీతారామరాజు (మన్యం వీరుడు) నవల రాస్తానని ప్రమాణం చేశారు. ఆదివాసీల పరిశోధనలో భాగంగా ఆమె తెలంగాణ గిరిజన పోరాటాలపై విస్తృత సమాచారం సేకరించారు .సామాజిక అణచి వేతలపై తిరగబడ్డ ఘనచరిత్ర గల కుమ్రంభీం వంటి ఆదివాసీ పోరాట యోధుల్లో ఉన్నట్లు ఆమె గ్రహించారు. అల్లూరి నవలా ప్రయత్నం నెరవేరితే తెలుగు ప్రాంతాల గిరిజనోద్యమానికి ఇంకా వెలుగు ప్రసరించేది. అణగారిన వర్గాల గొంతుకగా తన కధా రచనలతో కేంద్ర సాహిత్య అకాడమీ(1979), జ్ఞానపీఠ్ (1996) రామన్ మెగసెసె (1997), పద్మభూషణ్ (2006) పురస్కారాలు అందుకున్న బెంగాలి రచయిత్రి మహాశ్వేత హఠాత్తుగా జూలై 28(2016)న కలకత్తాలో కన్నుమూయడంతో అడవి ఒక్కసారిగా నిర్ఘాంత పోయినట్లయింది. అడవి సంరక్షణ, ఆదిమ జాతుల వారు రక్షితులుగా రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకునేలా నేటి పాలకులు కొంతైనా చేయగలిగితే అదే మహాశ్వేతకు నిజమైన నివాళి !
గుమ్మడి లక్ష్మినారాయణ (జీఎల్)
9491318409
0 Comments