//నఖాల సంరక్షణతో... ఆరోగ్యం//

                 శుభ్రత అనగానే ముందుగా గుర్తుకు రావాల్సింది చేతుల కన్న గోళ్ళు. ఎందుకంటే మనం ఏం తిన్నా ముందు నోట్లోకి వెళ్లాడానికి ఆస్కారం ఉంది. నిత్యజీవితంలో ఏ పని చేయాలన్నా వేళ్ళ సహాయం అవసరం. యాదృచ్చికంగా ఎన్నో వస్తువులను ముట్టుకుంటుంటాం. వ్యక్తిగత శుభ్రతలో భాగంగా గోళ్ళ శుభ్రత సాధారణంగా గుర్తెరగని విషయం. కాని నేడు పౌర సమాజం స్వచ్ఛత - వ్యక్తిగత శుభ్రత పై శ్రద్ద పెడుతున్న తరుణంలో గోళ్ళ సంరక్షణ కూడా ప్రాధాన్యత కల్గిన సూక్ష్మ అంశం. కొందరికి చిన్నప్పటి నుంచి చేతి గోళ్లు పెంచుకోవడం అనే అలవాటు పరిపాటిగా మారింది. మన మీద మనకున్న నమ్మకమో! ఏమోగాని గోళ్ళ శుభ్రత   గురించి అంతగా పట్టించుకోరు కొందరు. ఎవరికి వారు గోళ్ళ శుభ్రతను  పాటిస్తున్నామనే ధీమా చాలా మందిలో ఉంటుంది. అది ఆరోగ్య లక్షణం కాదు. కొన్ని సమయాల్లో గోళ్ళలో మట్టి చేరడం వల్ల వందలాది క్రిములకు గోళ్ళు ఆవాసంగా మారుతున్నాయి. చేతుల అందానికి ప్రధాన ఆకర్షణగా గోళ్ళను పెంచుకోవడం ఆనవాయితీ. వాటికి సంప్రదాయంగా గోరింటాకు పెట్టే బదులు వివిధ రంగులు వేసి మురిసి పోతుంటారు. వీటికి తోడు కొత్తగా 'నెయిల్ ఆర్ట్' అంటూ కొత్త ప్యాషన్ కు అలవాటు పడుతున్నారు.

              చేతి గోళ్ళను పెంచుకోవడం చూడ్డానికి అందంగా తోచినా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో గోళ్లు అస్సలు పెంచుకోకూడదని చెబుతున్నారు వైద్య నిపుణులు. తాజా నివేదికల ప్రకారం కరోనా వ్యాప్తికి పొడవైన గోళ్ళు కూడా కారణం అంటున్నారు వైద్యులు. చేతులను శుభ్రం చేసుకున్నప్పటికీ ఒక్కోసారి వ్యాధికారక వైరసులు, బ్యాక్టీరియాలు గోళ్ళలోనూ ఉండి పోవడం సహజం. పొడవాటి గోళ్లలో వైరస్ స్థిరంగా ఉంటుంది. ఈ కారణంగా మనం తీసుకునే ఆహారంలో ఆ వైరసులు చేతి గోళ్ళ ద్వారా పొట్టలోకి చేరతాయి. దీని ద్వారా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవ శాస్త్రీయంగా గోళ్ళు అనేవి మనిషికి అవశేష అవయవాలు. కేవలం అందం కోసం, రికార్డుల కోసం పెంచుకోవడం తప్ప వీటికి ప్రత్యేక విధి అంటూ ఏది లేదు. శరీరానికి నిరుపయోగమైన గోళ్ళను అందంగా భావిస్తూ అనారోగ్యాన్ని తెచ్చుకోవడం యాదృచ్చికంగా జరిగిపోతోంది. కొందరికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. అతి కొద్ది మందికి వేళ్ళను నోట్లో పెట్టుకునే అలవాటూ ఉంటుంది. ఆ సమయంలో నోటి ద్వారా వైరస్ శరీరంలోపలికి వెళుతుంది.

మొదటి ఏడాది మొదలు అయిదో తరగతి వరకు చదివే పిల్లల వరకూ వాళ్ళ చేతి గోళ్ళలోకి మట్టి చేరడం యాదృచ్చికంగా జరుగుతుండడంతో తరచుగా రోగాల బారిన పడుతున్నారు. నేలపై ఆటలాడుకోవడానికి ఇష్టపడే పల్లెప్రాంతాల్లోని పిల్లల్లో ఈ నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రుల అవగాహన లేమి కూడా ప్రస్ఫుటం. రైతులు మరియు వయస్కులు వ్యవసాయం లేదా మట్టి పనులు చేస్తున్న సందర్భాలలోనూ గోళ్ళలోకి మట్టి చేరడం మూలాన ఒక్కోసారి టెటానస్ క్రీములు మట్టితో పాటు చేరిపోతాయి. గాయాలైన సందర్భంలోనూ టెటానస్ బ్యాక్తీరియాలు మట్టి ద్వారా శరీరంలోకి చేరడం సాధారణం. అందువల్ల ధనుర్వాతం (టెటానస్), అమీబిక్ డీసెంట్రీ (అమీబియాసిస్) వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచీ తప్పించుకోవాలంటే ఖచ్చితంగా పెరిగే గోళ్లను ఎప్పటికప్పుడు చిన్నవిగా కత్తిరించుకుంటే క్రిముల దాడి నుండి రక్షించుకోగలుగుతాం.
                                         # గోళ్ళ సంరక్షణ #
          కాల కృత్యాలు తీర్చుకున్నాక ఎప్పటికప్పుడు సబ్బుుతో శుభ్రంగా చేతులు కడుక్కునేటప్పుడు గోళ్ళ సందులు కూడా శుభ్రం చేసుకోవాలి. ఆహారం తీసుకునే సమయంలో గోళ్ళను తప్పనిసరిగా డెటాల్/డిటర్జెంట్ సబ్బుతో  శుభ్రం చేసుకోవాలి. తాజా పోషకాహారం తీసుకుంటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయేముందు చేతులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చేతులు, గోళ్ళు మృధువుగా ఉంటాయి. లేదా పెట్రోలియం జెల్లీ/అవకాడో ఆయిల్ తో గోళ్ళకు మర్దనా చేస్తే గోళ్ళ పై మురికి, ఇతర నిర్జీవ కణాలు తొలిగిపోతాయి. వస్తువుల మూతలు తీయడానికి గోళ్ళను ఉపయాగించరాదు. నెయిల్ పాలిష్ చేయడం వల్ల రసాయనాలు నోట్లోకి వెళితే అనేక అనర్థాలకు దారితీస్తుంది. కనుక గోరింటాకు వంటి ప్రకృతి సిద్ధమైనవి వాడితే మేలు. వ్యక్తిగత శుభ్రత విషయంలో సైన్సు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే గోళ్ళ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ద పెట్టేలా సూచనలివ్వాలి. సమగ్ర శిశు సంరక్షణ కేంద్రాలలో, ప్రాథమిక-ఉన్నత పాఠశాలలలో గోళ్ళ సంరక్షణపై వారానికొకసారి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది.
                                                                                        - గుమ్మడి లక్ష్మీనారాయణ, 9491318409